iDreamPost
iDreamPost
ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసేశారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు విస్తుగొలిపేలా ఉన్నాయి. ఒక్కసారి అవకాశం ఇవ్వండని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు జేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన యనమల నిర్వాకం వల్లే కదా వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి ఖాళీ ఖాజానా వారసత్వంగా వచ్చింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం రూ.100 కోట్ల నిల్వతో రాష్ట్ర ఖజానాను కొత్త ప్రభుత్వానికి టీడీపీ సర్కారు అప్పగించింది. పైగా తాము ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేశామని, ఇక వైఎస్సార్ సీపీకి రుణం పుట్టదని కూడా అప్పట్లో యనమల సెలవిచ్చారు.
విభజన ఆంధ్రప్రదేశ్‌కు రూ.93వేల కోట్ల అప్పు ఉండగా, టీడీపీ ఐదేళ్ల పాలన పూర్తయ్యే సరికి అది రూ.2.56 లక్షల కోట్లకు చేరింది. చేసిన అప్పులన్నీ దుబారాగా ఖర్చు చేసి, వివిధ పనులకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలను పేరుకుపోయేలా చేసిన ఘనత అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న యనమలది కాదా అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు. ఆ బకాయిలను, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలను చెల్లించడానికి కొత్త ప్రభుత్వం అనివార్యంగా అప్పులు చేయాల్సి వచ్చింది. ఆర్థిక అంశాల్లో విశేష అనుభవం ఉన్న యనమలకు ఈ విషయాలన్నీ తెలిసినా తమ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు.
ప్రతిపక్షం హక్కును ఎవరు కాదన్నారు?
ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత హక్కు ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే హక్కు ఉందని యనమల అన్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని పోలీసులతో గొంతు నోక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని..ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో… ఎప్పుడు పోతుందో తెలియదని వ్యాఖ్యలు చేశారు.
చీటికి మాటికి పోలీసులను ఆడిపోసుకోవడం తెలుగుదేశం నాయకులకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కింది స్థాయి నాయకుల వరకు పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక వారి అంతు చూస్తామని బెదిరిస్తున్నారు కూడా. ఆర్థిక నేరాల్లోనూ, హత్యకేసుల్లోనూ నిందితులైన టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడమో, కేసులు పెట్టడమో చేస్తే అది వేధించడం, గొంతు నొక్కడం ఎలా అవుతుంది. ప్రతిపక్షంలో ఉంటే చట్టాలతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా శాంతి భద్రలకు భంగం కలిగిస్తే పోలీసులు చూస్తూ ఊరుకోవాలా? అలా ఊరుకోకుండా పోలీసులు తమ విధులను నిర్వహిస్తే ప్రతిపక్షం హక్కులను కాలరాచి, గొంతు నొక్కేసినట్టా? పోలీసులు నిజంగా అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటే న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు కదా? అలాకాకుండా మొత్తం పోలీసుశాఖను నిందిస్తూ ఇష్టానుసారం, అసభ్యమైన భాషతో విమర్శలు చేయడం ఎందుకు? పోలీసులపైనే రౌడీయిజం చేస్తున్న టీడీపీ నేతలు తిరిగి రౌడీరాజ్యం నడుస్తోందని విమర్శలు చేయడమే విడ్డూరంగా ఉంది. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ నేతల వైఖరిని పోలీసు అధికారుల సంఘం పలు సందర్భాల్లో ఖండించింది కూడా.
ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో… ఎప్పుడు పోతుందో తెలియదని అంటున్న యనమలకు ఆ బెంగ అవసరం లేదని, తమ సర్కారు నిండు ఐదేళ్లూ సమర్థంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలతో పనిచేస్తుందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. యనమల కలులు కంటున్నట్టు ఈ ప్రభుత్వానికి ఏమీ కాదని, జనం బలం ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి ఈ రాష్ట్రాన్ని దీర్ఘకాలం పాలిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.