iDreamPost
android-app
ios-app

టీడీపీకి భంగపాటు, వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థిదే విజయం

  • Published Aug 04, 2021 | 8:18 AM Updated Updated Aug 04, 2021 | 8:18 AM
టీడీపీకి భంగపాటు, వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థిదే విజయం

కాకినాడ మునిసిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల రసవత్తరంగా సాగింది. చివరకు టీడీపీకి భంగపాటు తప్పలేదు. ఆపార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థి విజయం సాధించారు. వైఎస్సార్సీపీ మద్ధతుతో సునాయసంగా ఆయన విజయం సాధించారు. కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. ఎక్స్ ఆఫీషియో హోదాలో తమ ఓటు వినియోగించుకున్నారు. అదే సమయంలో పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించేందుకు వ్యూహాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దాంతో టీడీపీ ప్రయత్నాలు ఫలించలేదు.

జగన్ ప్రభుత్వం పరిపాలనా విధానంలో తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా స్థానిక సంస్థల్లో డిప్యూటీ మేయర్ గా రెండో వారికి కూడా అవకాశం వచ్చింది. దాంతో రెండో డిప్యూటీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి కాకినాడలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటుగా వైఎస్సార్సీపీ కూడా పోటీ పడింది. 2017 మేయర్ ఎన్నికల్లో ఇక్కడ పీఠం దక్కించుకున్న టీడీపీ మేయర్ గా అధికారంలో ఉన్న ఏకైక కార్పోరేషన్ గా ప్రస్తుతం కాకినాడ ఉంది. దాంతో ఇక్కడి డిప్యూటీ మేయర్ సీటు వారికి ప్రతిష్టాత్మకంగా మారింది.

అయితే టీడీపీకి చెందిన 21 మంది కార్పోరేటర్లు తిరుగుబాటు చేశారు. పార్టీకి దూరంగా గడిచిన కొన్ని నెలలుగా వారంతా స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వర్గంలోనే ఉన్నారు. ఇప్పుడు టీడీపీ విప్ జారీ చేసి అంతా తమకే ఓటు వేయాలని ఆదేశించడంతో తిరుగుబాటులో కార్పోరేటర్లంతా కలిసి తమను స్వతంత్ర్య కూటమిగా గుర్తించాలని ఎన్నికల అధికారి , జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా కి లేఖ రాశారు. దాంతో మొత్తం 48 మంది కార్పోరేటర్లకు గానూ టీడీపీ గెలిచిన 32 మందిలో 21 మందిని కోల్పోయింది. దాంతో ఆపార్టీ బలం 11కి పరిమితమయ్యింది. ఇక ముగ్గురు బీజేపీలో ఒకరు వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థికే ఓటు వేస్తామని ముందుగా ప్రకటించారు. ఇక 10 మంది వైఎస్సార్సీపీ కార్పోరేటర్లలో ఒకరు మరణించడంతో ఆపార్టీ బలం 9గా ఉంది.

ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. కార్పొరేషన్‌ పాత సమావేశమందిరంలో ఎన్నికల అధికారి జేసీ లక్ష్మీశ పర్యవేక్షణలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే సమావేశానికి టీడీపీకి చెందిన 5గురు కార్పోరేటర్లు గైర్హాజరు కావడం విశేషం. ఇక చివరకు టీడీపీ రెబల్ కార్పోరేటర్, ప్రస్తుతం ఎమ్మెల్యే వర్గీయుడిగా ఉన్న చోడిపల్లి సత్య ప్రసాద్ అనే సీనియర్ నాయకుడిని రెండో డిప్యూటీ మేయర్ గా ఎన్నుకున్నారు. ఆయనకు 25 మంది సభ్యుల మద్ధతు దక్కింది. టీడీపీ అభ్యర్థి పోటీ పడినప్పటికీ 13 మంది మాత్రమే అనుకూలంగా ఓట్లు వేశారు. దాంతో ప్రతిష్టాత్మక డిప్యూటీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ త్వరలోనే మేయర్ పై అవిశ్వాసానికి సన్నాహాలు చేస్తోంది.