iDreamPost
iDreamPost
రాష్ట్రంలో గత ఎన్నికల వరకు కృష్ణా జిల్లా తెలుగుదేశానికి కంచుకోటగా పేరొందింది. అప్పుడప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఓటమిపాలైనా తర్వాత కోలుకుని నిలదొక్కుకుంటుందన్న పేరుండేది. కానీ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ధాటికి టీడీపీ కేవలం రెండు నియోజకవర్గాలకే పరిమితం అయ్యింది. మిగతా నియోజకవర్గాల పరిస్థితి పక్కన పెడితే జిల్లాలోని తిరువూరు మాత్రం టీడీపీ అధిష్టానానికి కొరుకుడు పడటం లేదు. ఒకప్పుడు వరుస విజయాలు అందించిన ఈ నియోజకవర్గం గత నాలుగు ఎన్నికల్లోనూ టీడీపీకి ఝలక్ ఇచ్చింది. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ఇంఛార్జీలను, అభ్యర్థులను మార్చినా ఫలితం కనిపించడం లేదు.
వరుస పరాజయాలు
టీడీపీ ఆవిర్భావం నుంచి 1999 ఎన్నికల వరకు తిరువూరులో ఆ పార్టీకి ఎదురు లేకుండాపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్.. ఇప్పుడు వైఎస్సార్సీపీ అక్కడ పాగా వేశాయి. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నల్లగట్ల స్వామిదాస్ తన నిర్లక్ష్య ధోరణితో స్థానిక ప్రజలకు దూరం అయ్యారు. దానికి తోడు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హవా కూడా ఉండటంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోనేరు రంగారావు చేతిలో స్వామిదాస్ ఓటమి చెందారు. 2009 ఎన్నికల్లోనూ అదే అనుభవం ఎదురైంది. స్వామిదాస్ ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి దిరిసం పద్మజ్యోతి ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల నుంచి తిరువూరులో వైఎస్సార్సీపీ పాగా వేసింది. ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ టీడీపీ స్వామిదాసునే మళ్లీ నిలబెట్టగా.. వైఎస్సార్సీపీ తరపున తొలిసారి పోటీ చేసిన కొక్కిలిగడ్డ రక్షణానిధి విజయం సాధించారు. దాంతో 2019 ఎన్నికల్లో టీడీపీ స్వామిదాసును పక్కన పెట్టి కొవ్వూరు నుంచి కె.ఎస్.జవహర్ ను తీసుకొచ్చి పోటీ చేయించినా రక్షణానిధే రెండోసారి విజయ బావుటా ఎగురవేశారు.
ఇంఛార్జి మారినా అదే తీరు
వరుసగా నాలుగో ఎన్నికలో కూడా పరాజయంతో ఇక లాభం లేదనుకున్న టీడీపీ అధిష్టానం కొన్నాళ్ల క్రితం నియోజకవర్గ ఇంఛార్జిని మార్చింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన జవహర్ ను రాజమండ్రికి పంపేసింది. మాజీ ఎమ్మెల్యే స్వామిదాసును కూడా పూర్తిగా పక్కన పెట్టేసి.. శావల దేవదత్ ను ఇంఛార్జిగా నియమించింది. కానీ స్వామిదాస్ మాదిరిగానే ఆయన కూడా చురుగ్గా పనిచేయడంలేదని పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రక్షణనిధి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆసరాగా చేసుకొని నియోజకవర్గంలో పూర్తిగా బలపడ్డారు. పార్టీని కూడా పటిష్టంగా తీర్చిదిద్దారు. దాని ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. గత నెలలో తిరువూరు నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేట జెడ్పీటీసీ ఎన్నిక దీనికి తాజా ఉదాహరణ. ఈ ఎన్నికలో వైఎస్సార్సీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు. కానీ 6 వేల ఓట్ల భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ దాన్ని ఎగరేసుకుపోయింది. ఒక జెడ్పీటీసీ స్థానంలో ఇంత మెజారిటీ సాధించడం చిన్న విషయం కాదు. పరిస్థితి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ తిరువూరులో టీడీపీకి తిప్పలు తప్పవని ఆ పార్టీ కార్యకర్తలే నిస్పృహతో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : Tdp Believes – ప్రజలంతా టీడీపీ వెనుకేనట..!