iDreamPost
iDreamPost
నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని ఓ నానుడి. కానీ టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో అడ్డగోలుగా నోరు పారేసుకుని కొమ్మారెడ్డి పట్టాభి కష్టాలు కొనితెచ్చుకున్నారు. చివరకు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. రా..దమ్ముంటే చూసుకుందామంటూ భీకరాలు పలికిన టీడీపీ నేతలే పట్టాభి పారిపోవడానికి ఏర్పాట్లు చేయడం విశేషం.
ఇటీవల సీఎం జగన్ పట్ల వ్యక్తిగత దాడుల్లో భాగంగా పట్టాభి హద్దులు మీరడం పెను దుమారం రేపింది. టీడీపీ నేతలకు తలవంపుగా మారింది. తమ కార్యాలయంపై దాడిని భూతద్దంలో చూపించి అలజడి రేపాలని ప్రయత్నించినా దానికి మూలం టీడీపీ నేతల మాటల్లో ఉండడంతో జనం చీదరించుకున్నట్టు కనిపించింది. ఏకంగా రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చినా కనీస స్పందన కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు దీక్ష, హస్తిన పర్యటనా అన్నింటా టీడీపీకి చుక్కెదురవుతోంది.
ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలతో పట్టాభి మీద కేసులు నమోదయ్యాయి. ఆయన్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ కోసం తరలించగా చివరకు బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత మరో హైడ్రామా నడిపారు. పట్టాభి కనిపించడం లేదంటూ టీడీపీ నేతలు కొత్త నాటకం ముందుకు తెచ్చారు. తీరా పట్టాభి తాజాగా హైదరాబాద్ నుంచి మాలే వెళ్లే ఫ్లైట్ లో కనిపించడం ఆశ్చర్యంగా మారింది.
సీఎంని సవాల్ చేసిన నేత ఏకంగా మాల్దీవులకు పారిపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. అయితే ఆయన తీరుతో వచ్చిన సమస్యల కారణంగా కొత్త కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళనతో భయపడి పారిపోయినట్టుగా అంతా భావిస్తున్నారు. గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ లో ఆయన ప్రయాణిస్తుండగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాంతో టీడీపీ నేతలది మేకపోతు గాంభీర్యమే తప్ప ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడే సత్తా లేనివారిగా ప్రజల్లో అభిప్రాయం బలపడుతోంది. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొన్న జగన్ కి, ఇలాంటి కేసులతోనే దేశం విడిచి పారిపోతున్న టీడీపీ నేతలకు పొంతన ఎక్కడా అనే ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.
Also Read : Pattabhiram Absconded – అజ్ఞాతంలోకి పట్టాభి.. ఆ భయమే కారణమా..?