విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలపై తెలుగు నేల నలుమూలలా వ్యతిరేకత కనిపిస్తోంది. అనేక మంది తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో కేంద్రంతో విబేధిస్తోంది. స్వయంగా సీఎం వైఎస్ జగన్ నేరుగా ప్రధాని కి రాసిన లేఖలో ఈ విషయం పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాల్సిన అవసరం లేకుండా లాభాల్లో నడిపించేందుకు ఏం చేయాలన్నది స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో ముందుకెళితే తాము తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కూడా ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే హస్తినలో వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటీకరణ యత్నాలు మానుకోవాలని కేంద్రంలోని పెద్దలకు మెమోరాండం సమర్పించారు. పార్లమెంట్ లో కూడా ప్రస్తావించి, తమ వ్యతిరేకతను తెలిపారు. అంతేగాకుండా స్టీల్ కార్మికుల ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఐక్యంగా విశాఖ ఉక్కు పరిరక్షణకు ప్రయత్నించాలని పలువురు సూచిస్తున్నారు. గతంలో సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమాల అనుభవంతో ఈసారి రాజకీయ పార్టీల తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు .. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రాజకీయాల కోసం ప్రజలను వంచించవద్దనే సూచనలు వినిపిస్తున్నాయి. ఉండవల్లి వంటి వారు కూడా అలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. రెండు ప్రధాన పార్టీలు ఉమ్మడిగా ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమించాలని తెలిపారు. కానీ టీడీపీ తీరు దానికి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే చుట్టు వెలిగించుకోవడానికి నిప్పు కోసం మరొకరు ప్రయత్నం చేసినట్టుగా ఆపార్టీ ధోరణి కనిపిస్తోంది. విశాఖ ఉక్కు ఉద్యమంలో కార్మికులు, రాష్ట్ర ప్రజలు ఆందోళనతో ఉన్న సమయంలో అందరూ కలిసి పోరాడేందుకు బదులుగా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తోంది. తన మార్క్ రాజకీయాలతో టీడీపీ తన తీరు చాటుకుంటుంది.
ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్షకి దిగారు. నిజానికి ఉద్యమం కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద చేయాల్సి ఉంది. కానీ టీడీపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కుపెట్టారు. తమ లక్ష్యం ప్లాంట్ ని కాపాడడం కాదని, కేవలం జగన్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోడమేనని చాటుకుంటున్నారు. మోడీ సర్కారు మన రాష్ట్రంలోనే అతి పెద్ద పరిశ్రమను కార్పోరేట్లకు కట్టబెడుతుంటే మధ్యలో పోస్కో ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారనే విషయాన్ని టీడీపీ హైలెట్ చేయడం ఆశ్చర్యకరం. వాస్తవానికి జగన్ మాత్రమే కాదు..ఆయనకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా స్వయంగా కొరియా వెళ్లి మరీ పోస్కో పెద్దలతో భేటీ అయ్యారు. తాను చేస్తే మాత్రమే సంసారం..ఇతరులది వ్యభిచారం అనే రీతిలో వ్యవహరించే చంద్రబాబు ఇక్కడ కూడా జగన్ మీద బురదజల్లడమే తన పని చాటుకుంటున్నారు. మోడీ తీరు మీద విమర్శలు చేయలేక జగన్ మీద ఎక్కుపెట్టి జనాలను వంచించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ అనేక మార్లు భంగపడింది. తాజా పంచాయితీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆపార్టీని ఓడించడం వెనుక కారణం కూడా అదే. తాను ఏం చేసినా, ఎంత చెప్పినా చెల్లుతుందని విశ్వసించే చంద్రబాబు వైఖరి మారకుండా ప్రజలు ఆయన్ని విశ్వసించే అవకాశం లేదు. అయినప్పటికీ తనకు అక్కడక్కడా కొన్ని సీట్లు రావడమే గొప్ప అన్నట్టుగా సంబరాలు చేసుకుంటున్న ఆపార్టీ శ్రేణులు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో ఇప్పటికే ఏకాకులయ్యారు. చివరకు నారా లోకేష్ ఏకంగా 1978లోనే ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరిగాయంటూ చేసిన వ్యాఖ్యలు మరింత అభాసుపాలుజేశాయి. అయినప్పటికీ పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. నిజంగా ఏపీ ప్రజల ప్రయోజనాల మీద, విశాఖ ఉక్కు పరిరక్షణ మీద టీడీపీ కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విశాల వేదికపై ఉమ్మడి ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. కేంద్రంలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్ధతుగా నిలవాల్సి ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా కేంద్రంలో అధికార పార్టీ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఒత్తిడి పెడుతుంటే, అక్కడ పార్లమెంట్ లో కేంద్రాన్ని వదిలి, రాష్ట్రంలో అధికార పార్టీ మీద విమర్శలు ఎక్కు పెట్టేందుకు సిద్ధమవుతున్న టీడీపీ తీరు రాష్ట్రానికి నష్టం చేస్తుందనే విషయం గమనార్హం
ఆమరణ దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాస్ కూడా ఇప్పటి వరకూ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. పైగా ప్రైవేటీకరణ చేస్తున్న మోడీ ని వదిలేసి మరొకరి మీద విమర్శలు చేస్తుండడంతో కార్మికుల్లో కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. స్వయంగా ఆయన గాజువాకలోనే దీక్ష చేస్తున్నప్పటికీ స్టీల్ ప్లాంట్ ఎదురుగా నిర్వహిస్తున్న శిబిరం వద్దకు వస్తున్న జనాలు కూడా ఆయన క్యాంపు పట్ల ఆసక్తి చూపకపోవడానికి ఈ అనుమానాలే కారణం.. ఇప్పటికయినా టీడీపీ నేతలు తెలుసుకుంటే మంచిది. లేదంటే మరింత ఒంటరిపాలు కావడం ఖాయం. అది రాష్ట్ర ప్రజలకు గానీ, ఆ పార్టీ నేతలకు గానీ మంచిది కాదన్నది గుర్తించాలి.