ఎన్నికలంటేనే ముందస్తు ప్రణాళికలు..పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవడం.. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ.. పై ఎత్తులు వేయడం ద్వారా ముందంజ వేయాల్సి ఉంటుంది. ఏ పార్టీ అయినా ఇవే విధానాలు అనుసరించక తప్పదు. కానీ నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ ముందస్తు ప్రణాళికల మాటెలా ఉన్నా.. పలు అంశాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల ప్రథమాంకంలోనే దెబ్బతింది. అభ్యర్థుల ఎంపిక నుంచి వామపక్షాలతో పొత్తు వరకు సకాలంలో నిర్ణయాలు తీసుకోలేక చతికిల పడింది. సొంత పార్టీ వారినే అడ్డుకోలేక, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీపై అబాండాలు వేస్తోంది.
11 చోట్ల టీడీపీ అభ్యర్థులే లేరు
ముందస్తు ప్రణాళికలు లేకపోవడం.. అభ్యర్థుల ఎంపికలో ఇద్దరు నేతలే చక్రం తిప్పడం వల్ల నగరపాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లలో 11 చోట్ల టీడీపీకి అభ్యర్థులు లేకుండా పోయారు. అభ్యర్థుల ఎంపికలో నెల్లూరు సిటీ పరిధిలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, రూరల్ పరిధిలో అబ్దుల్ అజీజ్ చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా పార్టీ జిల్లా నేతలు అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్రలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ ఇద్దరు నేతలే ఇచ్చేశారు. మరో వైపు కొందరు అభ్యర్థులు వైఎస్సార్సీపీలో చేరనున్నారన్న అనుమానంతో 12 మంది టీడీపీ అభ్యర్థులతో క్యాంప్ నిర్వహించారు. పక్కా టీడీపీ వారన్న ఉద్దేశంతో మిగిలిన వారిని వదిలేశారు.
Also Read : Petrol Prices, Sajjala – సజ్జల ప్రతిపాదన ఉభయతారకం
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం చివరి క్షణాల్లోనే అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారు. ఇంత చేసినా వలసలను ఆపలేకపోయారు. 20వ డివిజన్ అభ్యర్థి రాజు యాదవ్ బీ ఫారం తీసుకున్న తర్వాత వెళ్లి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ వెంటనే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే 29వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ సీనియర్ నేత అబ్దుల్ అజీజ్ సన్నిహితుడు చివరి నిమిషంలో దాన్ని విత్ డ్రా చేసుకున్నారు. మొత్తం మీద 11 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులే లేకుండా పోయారు. వాటిలో 7, 8, 12, 20, 24, 37, 38, 40 డివిజన్లు ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ ఖాతాలోకి వెళ్లాయి. మిగిలిన మూడు డివిజన్ల(4, 29, 45)లో ఇతర పార్టీల అభ్యర్థులు రంగంలో ఉండటంతో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.
వామపక్షంతో పొత్తులోనూ చిత్తు
సీపీఎంతో సీట్ల సర్దుబాటు ప్రతిపాదన రాగా కొంత చర్చలు జరిగాయి. అయితే వాటిని తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభించడంతో చివరికి అది ఆచరణలోకి రాలేదు. దాంతో సీపీఎం 17 డివిజన్లలో తన అభ్యర్థులను రంగంలోకి దించింది. మరోవైపు ఈ సర్దుబాటు ప్రయత్నాల వల్ల టీడీపీ అభ్యర్ధుల ఎంపిక వ్యవహారం కూడా చివరి క్షణం వరకు తేలలేదు. కాగా అధికార వైఎస్సార్సీపీ ముందు నుంచే ఎన్నికలకు సిద్ధమై ప్రణాళిక ప్రకారం దూసుకుపోతోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపికలో తలెత్తిన కొద్దిపాటి అసంతృప్తులను కూడా చర్చల ద్వారా సర్దుబాటు చేసుకొని సమైక్యంగా ముందుకు కదులుతోంది.
Also Read : Social Media TDP -చంద్రబాబుకు సోషల్ మీడియా సెగ