iDreamPost
iDreamPost
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని ముఖ్యమంత్రి జగన్‌కు లేదని ఒక అడ్డగోలు స్టేట్మెంట్ ఇచ్చిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దానికి సమర్థింపుగా వాస్తవాలను దారుణంగా వక్రీకరించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కొత్త గవర్నమెంట్ రాగానే మోదీకి సీట్లు ఎక్కువ వచ్చాయని, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ముఖ్యమంత్రి అన్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన రిప్రజెంటేషన్‌లో ప్రత్యేకహోదా ప్రస్తావనే లేదని అన్నారు. 2019 ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే వైఎస్సార్ సీపీ ధ్యేయమని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. తమ పార్టీని మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చే ప్రభుత్వానికే కేంద్రంలో మద్దతు ఇస్తామని చెప్పారు. ఒక్క ప్రత్యేక హోదాయే కాక రాష్ట్రానికి కావాల్సిన పనులను కేంద్రం మెడలు వంచి మరీ చేయిస్తామని తెలిపారు.
అయితే కేంద్రంలో బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ సాధించింది. జగన్మోహనరెడ్డి సీఎం హోదాలో వెళ్లి ప్రధాని మోదీని కలిసి ప్రత్యేకహోదాతో పాటు పలు రాష్ట్ర సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందించారు. అనంతరం ప్రధాని నివాసం బయటే సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ తమకు 22 ఎంపీ స్థానాలు వచ్చినా వైఎస్సార్ సీపీ మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినందున ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేసే పరిస్థితిలేదని చెప్పారు. అయినా ప్రత్యేక హోదా అంశాన్ని తాము విడిచిపెట్టబోమని, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రతి సందర్భంలోనూ విజ్ఞప్తి చేస్తూనే ఉంటామని ప్రకటించారు. వాస్తవం ఇది కాగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని జగన్మోహన్ రెడ్డి అన్నారని పయ్యావుల మాట మార్చడం శోచనీయం.
ప్రత్యేక హోదా సంజీవనా అన్నది బాబు కదా..
తన స్వార్థంకోసం ముఖ్యమంత్రిగా ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రబాబుది. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేకహోదాను బాబు తాకట్టు పెట్టారు. పైగా
ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అది సాదించిన రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా అని ప్రెస్ మీట్లలో ఆయన ప్రశ్నించారు కూడా. ప్రత్యేక ప్యాకేజీ ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు.
ప్రత్యేక హోదా అంశం బతికున్నది జగన్ వల్లనే..
ఇప్పటికీ ప్రత్యేక హోదా అంశం బతికి ఉందంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ వేదికలపై దాని గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుండడం వల్లనేనని వైఎస్సార్ సీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు. సొంత లబ్ధికోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడమే కాక రాజకీయంగా మైలేజీ వస్తుందని ఇలా వాస్తవాలు వక్రీకరించడం కేశవ్ కు తగదని అధికారపార్టీ నేతలు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువగా అంచనా వేసి వారిని తప్పుదోవ పట్టిద్దామనుకుంటే టీడీపీకి మరోసారి కోలుకోలేని విధంగా బుద్ది చెబుతారని హెచ్చరిస్తున్నారు.
Also Read : కేంద్రం మళ్ళీ మాట మార్చింది.. హోదా తొలగించింది