Idream media
Idream media
రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి.. ఇలా 650 హామీలు ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చి.. వాటిని అమలు చేయని చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు టీడీపీ నేతలు నడుంబిగించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చెప్పేందుకు తమదైన శైలిలో 2019లో టీడీపీ ఓటమిని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల ప్రయత్నాలను తేటతెల్లం చేస్తున్నాయి.
‘‘పాదయాత్రలో వైఎస్ జగన్ ఒక్క ఛాన్స్ అంటూ 400 హామీలు ఇచ్చారు. చంద్రబాబుపై వ్యతిరేకత లేకపోయినా.. ఒక్క ఛాన్స్ అని జగన్ అగడంతో ప్రజలు ఓట్లు వేశారు. వైసీపీ నేతలు ఏనుగుల మందలా గ్రామాలపై పడి దోచుకుంటున్నారు. జగన్ 34 పథకాలు రద్దు చేశారు..’’ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తన నోటికి పని చెప్పారు. దీపక్ రెడ్డి ఏ లక్ష్యంతో ఈ మాటలు అన్నా.. ప్రజలు మాత్రం గతంలోకి వెళ్లిపోయారు. నాడు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. అమలు చేసిన వాటిని గుర్తు చేసుకుంటున్నారు.
నిజంగా చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదా..? జగన్ ఒక్క ఛాన్స్ అని అడిగినందుకే గెలిపించారా..? అనే చర్చను దీపక్‌రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా తెరతీశారు. 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేశారా..? అనే ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది. అమలు చేస్తే వ్యతిరేకత ఉండదు.. దీపక్ రెడ్డి మాటలు.. చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశారనేలా ఉన్నాయి. అసలు 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చారు..? టీడీపీ మేనిఫెస్టో ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్ పదే పదే.. ఈ విషయాన్ని ప్రస్తావించినా.. టీడీపీ మేనిఫెస్టో మాత్రం బయటపెట్టలేదు. మరి ఇప్పుడైన దీపక్ రెడ్డి టీడీపీ మేనిఫెస్టోను బయటపెట్టే సాహసం చేయగలరా..? అంటే అనుమానమే.
జగన్ 400 హామీలు ఇచ్చారని చెబుతున్న దీపక్ రెడ్డి.. అవి ఏమిటో మీడియా సాక్షిగా చెబితే చేస్తే ప్రజలు నమ్ముతారు. రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. తన మేనిఫెస్టోలో 90 శాతం హామీలను అమలు చేశామని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. ఎన్ని హమీలు ఇచ్చారు..? ఎన్ని అమలు చేశారు..? అనే విషయం ప్రజలకు తెలియాలంటే.. వైఎస్ జగన్ 400 హామీలను ఇచ్చారని చెబుతున్న దీపక్ రెడ్డి వాటిని ఓ కర పత్రంలో ముద్రించి పంచితే ప్రజలకు మేలు చేసినవారవుతారు. ఈ పని చేయడం ద్వారా జగన్ చెప్పేవి అవాస్తవాలని కూడా నిరూపించవచ్చు. తద్వారా రాజకీయంగా టీడీపీకి మేలు కూడా జరుగుతుంది. చంద్రబాబుపై వ్యతిరేకత లేదని మాటల్లోనే కాకుండా చేతల ద్వారా నిరూపించినవారవుతారు.