iDreamPost
android-app
ios-app

చెన్నై విమానాశ్ర‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

చెన్నై విమానాశ్ర‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (రవీంద్రనాథ్ రెడ్డి)ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై విమానాశ్ర‌యంలో అదుపులోకి తీసుకున్నారు. 2018లో పులివెందుల పూల అంగళ్ల వద్ద అల్లర్లు, ఘర్షణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్‌ రవిపై వారెంట్‌ పెండింగ్‌లో ఉంది. రాళ్ల దాడి, హత్యాయత్నం కేసులో ఇన్నాళ్లూ అరెస్ట్‌ కాకుండా, బెయిల్‌ తీసుకోకుండా బీటెక్ రవి తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో జరిగిన రాళ్ల దాడిలో ఎస్‌ఐ చిరంజీవికి గాయాలయ్యాయి. హత్యాయత్నం కింద బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై కేసులు నమోదయ్యాయి. ఎస్పీ అన్బురాజన్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. 2018లో జరిగిన అల్లర్ల కేసులో బీటెక్‌ రవిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. గతంలో జరిగిన అల్లర్ల కేసులో పలువురికి బెయిల్‌ లభించిందని, నిందితుడిగా ఉన్న బీటెక్ రవిని అరెస్ట్‌ చేశామని ఎస్పీ వివరించారు. లింగాల మహిళ హత్య కేసుకు, అరెస్ట్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా…

‘చలో పులివెందుల’ కార్యక్రమం నేపథ్యంలో బీటెక్ రవి, మరి కొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకుడాలలో దళిత మహిళ హత్యపై సరైన న్యాయం జరగలేదంటూ టీడీపీ ‘చలో పులివెందుల’ కార్యక్రమాన్ని చేపట్టింది. అసలైన నిందితులను వదిలేశారని ప్రచారం జరగడంతో నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిసెంబర్ 19న బీటెక్ రవి ఆధ్వర్యంలో టీడీపీ ర్యాలీ నిర్వహించి, డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. అయితే నాగమ్మ హత్య జరిగిన 48 గంటల్లోనే పోలీసులు నిందితున్ని అరెస్ట్‌ చేసి తమ కుటుంబానికి న్యాయం చేశారని.. కానీ, టీడీపీ నేతలు మాత్రం తమ పరువుకు భంగం వాటిల్లేలా ర్యాలీ నిర్వహించారంటూ బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు డిసెంబర్‌ 22న పోలీసులకు హత్యాచారానికి గురైన దళిత మహిళ తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీటెక్‌ రవి సహా 21 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీన్ని కూడా పోలీసులు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ర‌వితో పాటు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేత శ్రీరెడ్డి, కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, ఎస్సీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డితో పాటు విజయకుమార్‌రెడ్డి, గురప్ప, జయచంద్ర, హరిక్రిష్ణ, జింకా శ్రీను, బండి జయశేఖర్‌, అశోక్‌, కుళ్లాయప్ప, సుదర్శన్‌, నారాయణ తదితరులపై కేసు నమోదైంది. ఐదేళ్ల పాలనలో అప్పటి టీడీపీ నేతల దౌర్జన్యాలు, అక్రమాలు కోకొల్లలు. తాజాగా ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నాయకుడు నందం సుబ్బయ్య హత్యకు గురయ్యారు. ఈ సంఘటనలో అధికార పార్టీ నేతలు బీసీ నాయకుడిని అంతమొందించారంటూ ప్రతిపక్ష టీడీపీ నేతలు రాద్ధాంతానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత కక్షలను రాజకీయ కక్షలుగా చిత్రీకరించి టీడీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.