iDreamPost
iDreamPost
గత రెండు ఎన్నికల్లోనూ విశాఖ జిల్లా మాడుగులలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలే తగిలాయి. ఇటీవలి పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే పరాజయ పరంపర కొనసాగింది. అయినా ఆ పార్టీ నేతలకు కనువిప్పు కలగలేదు. గతం నుంచీ ఉన్న గ్రూప్ తగదాలను కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఉన్నా ఆ పదవి కోసం మరో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఫలితంగా పార్టీ మూడు గ్రూపులుగా విడిపోయింది. గవిరెడ్డి పార్టీని పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న ప్రచారం జోరుగా సాగుతుండటం.. ఇంఛార్జీని మారుస్తారని ఊహాగానాలు వినిపిస్తుండటంతో రామానాయుడు అభద్రతా భావానికి గురవుతున్నారు. ఎందుకైనా మంచిదని మరో నియోజకవర్గంపై కన్నేశారు.
గ్రూపుల గోల..
టీడీపీ ఆవిర్భావం తర్వాత మాడుగుల నియోజకవర్గానికి 9 ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు టీడీపీయే గెలిచింది. 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కరణం ధర్మశ్రీ నెగ్గడంతో టీడీపీ విజయాలకు బ్రేక్ పడింది. అయితే 2009లో మళ్లీ టీడీపీ గెలిచింది. తొలిసారి బరిలో దిగిన గవిరెడ్డి రామానాయుడు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో పరిస్థితి మారిపోయింది. టీడీపీ నుంచి చాలామంది నేతలు ఆ పార్టీలో చేరిపోయారు. 2014, 19 ఎన్నికల్లో గవిరెడ్డిని ఓడించి బూడి ముత్యాలనాయుడు ఎమ్మెల్యే అయ్యారు. వరుస ఓటములతో టీడీపీ డీలా పడింది. దానికి తోడు గ్రూపుల గోల మొదలైంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి తర్వాత టీడీపీలోకి వచ్చిన పైలా ప్రసాద్, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన పీవీజీ కుమార్ ఇంఛార్జి రామానాయుడుకు పోటీగా గ్రూపులను తయారు చేశారు. ఇంఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. ముగ్గురు నేతల ఆధిపత్య పోరులో కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఈ కారణంగానే స్థానిక ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోయామని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read : లోకేష్ ముందు మాజీ మహిళా ఎమ్మెల్యే బలప్రదర్శన ఎందుకు చేశారు..?
విశాఖ సౌత్ పై గవిరెడ్డి దృష్టి
ఇటీవల గవిరెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కలిశారు. నియోజకవర్గ పరిస్థితి వివరించడానికి ప్రయత్నించగా.. అప్పటికే పరిస్థితి తెలుసుకున్న అచ్చెన్న ఆయనకు క్లాస్ పీకారు. దాంతో ఇంఛార్జి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక అభద్రతభావానికి గురవుతున్న రామానాయుడు విశాఖ నగరంలో దక్షిణ నియోజకవర్గంపై కన్నేశారు. బంగారు నగల వ్యాపారి అయిన గవిరెడ్డి విశాఖ నగరంలోనే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడే మాడుగులకు వెళ్తుంటారు.
తాజా పరిణామాల నేపథ్యంలో మాడుగుల టికెట్ మళ్లీ తనకు ఇవ్వరేమోనని అనుమానపడుతున్న ఆయన విశాఖ నగరంలో బంగారు వర్తకం, వ్యాపారులు, పనివారు ఎక్కువగా ఉన్న విశాఖ సౌత్ నుంచి పోటీ చేయాలని ఆశ పడుతున్నారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైఎస్సార్సీపీలో చేరినందున.. ఆ స్థానం ఖాళీగా ఉండటం కూడా ఆశలు రేపుతోంది. దాంతో పలువురు పార్టీ పెద్దలను కలిసి తన మనసులోని మాటను వారి చెవిన వేశారని సమాచారం. మరి ఈ మార్పుకు పార్టీ అధిష్టానం ఆమోదిస్తుందా లేక ఇటు మాడుగుల.. అటు సౌత్ ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెడుతుందా అన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో జరుగుతోంది.
Also Read : ఆదిరెడ్డి వర్గం బాబు ఎదుట బలప్రదర్శన ఎందుకు చేసింది ..?!