iDreamPost
android-app
ios-app

TDP, Penukonda Municipality – అనంతపురం టీడీపీపై పెను’బండ’

  • Published Nov 18, 2021 | 5:36 AM Updated Updated Nov 18, 2021 | 5:36 AM
TDP, Penukonda Municipality – అనంతపురం టీడీపీపై పెను’బండ’

ఎన్నిక ఏదైనా అదే వరుస.. పరాజయాల పరంపర. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా దాన్నే పునరావృతం చేశాయి. పెనుకొండ నగర పంచాయతీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్సీపీకి పట్టం కట్టి.. టీడీపీ పరాజయాల పరంపరను సంపూర్ణం చేశారు. పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా ఓటర్లు కనికరించలేదు. కేవలం రెండు వార్డులకే ఆ పార్టీని పరిమితం చేసి ఇంటికి పంపించారు. దాంతో పెనుకొండ రూపంలో పడిన ఓటమి బండ కింద పడి జిల్లా టీడీపీ నలిగిపోయింది. కంచుకోటగా చెప్పుకొనే చోట ఇంత ఘోర పరాజయం ఆ పార్టీని కొలుకోనీయకుండా చేసింది.

నేతలందరూ తిష్ట వేసినా..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాల నేపథ్యంలో పెనుకొండ మున్సిపల్ ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకుని.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాలగుండ్ల శంకర నారాయణను దెబ్బ తీయాలని ప్రయత్నించింది. పెనుకొండ తమ కంచుకోటగా చెప్పుకునే పరిటాల కుటుంబానికి చెందిన మాజీమంత్రి సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి తదితరులు అక్కడే తిష్ట వేశారు. పరిటాల శ్రీరామ్ అయితే వార్డు వార్డుకు.. ఇంటింటికీ తిరిగి మరీ ప్రచారం చేశారు. కానీ ఓటర్లు మాత్రం అభివృద్ధి వైపే నిలిచారు. వైఎస్సార్సీపీకి జైకొట్టారు. మొత్తం 20 వార్డుల్లో 18 చోట్ల విజయం చేకూర్చారు. టీడీపీ ఒకటి, మూడు వార్డుల్లో మాత్రమే గట్టెక్కగలిగింది.

వరుస షాకులు

పెనుకొండ నియోజకవర్గం రెండున్నరేళ్ల క్రితం వరకు టీడీపీకి కంచుకోటగా ఉండేది. 1992లో పరిటాల రవీంద్ర అజ్ఞాతం వీడి టీడీపీలో చేరినప్పటి నుంచి అక్కడ ఆ కుటుంబానిది, ఆ పార్టీదే హవా. పరిటాల రవి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా.. 2009, 2014 ఎన్నికల్లో బీకే పార్థసారథి ఎమ్మెల్యే అయ్యారు. పరిటాల కుటుంబం కొత్తగా ఏర్పడిన రాప్తాడు నియోజకవర్గానికి మారి.. అక్కడ విజయాలు సాధించింది. 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. అటు రాప్తాడు, ఇటు పెనుకొండల్లో వైఎస్సార్సీపీ పాగా వేసింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే అత్యధికంగా గెలిచారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఒక్క తాడిపత్రి తప్ప అనంత జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ టీడీపీ మట్టికరిచింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినట్లు టీడీపీ చెప్పుకొంటున్నా అప్పటికే నామినేషన్లు వేసిన ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో కొనసాగినా ఓటమి తప్పలేదు. ఇప్పుడు పెనుకొండ నగర పంచాయతీ కూడా దక్కకుండా పోవడంతో టీడీపీ పూర్తిగా కుంగిపోయింది.

Also Read : Municipal Elections – ఎవరు ఎక్కడ గెలిచారంటే..