iDreamPost
iDreamPost
ఆయనకు ఒక రాజకీయ నాయకుడు. కానీ నోటికి హద్దూ అదుపూ ఉండదు. విపక్షం అనే పేరుతో అందరి మీద విరుచుకుపడుతూ ఉంటారు. అయిన దానికి కాని దానికి ఆరోపణలు చేస్తూ ఉంటారు. దేశం మొత్తం మీద ఎక్కడ ఏది జరిగినా అది ఏపీకి, ఆ తర్వాత సీఎంకి ముడిపెట్టే ప్రయత్నం చేస్తారు. జనం నమ్మినా, నమ్మకున్నా ఒక అబద్ధం వందసార్లు చెప్పయినా సరే జనాల్ని నమ్మించాలనే గోబెల్స్ సూత్రాన్ని ఒంటబట్టించుకున్నారు. అందుకే తోచిందల్లా మాట్లాడడమే తప్ప ఆధారాలు, సాక్ష్యాలు అంటే ఆయనకు గిట్టదు.
కానీ ఇప్పుడు సీన్ మారింది. రాజకీయాల పేరుతో ఎటువంటి విమర్శలు చేసినా సహించిన పోలీసులు, ఇప్పుడు పోలీస్ యంత్రాంగాన్ని టార్గెట్ చేయడంతో రంగంలోకి వచ్చారు. ఇష్టారాజ్యంగా విమర్శలు చేయడం పట్ల చట్టబద్ధమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి మాఫియాలకు సంబంధించి చేస్తున్న విమర్శలకు ఆధారాలు అడుగుతున్నారు. అవి చూపాలని నోటీసులు ఇస్తున్నారు. స్పందించకపోతే పరువు నష్టం దావాలు వేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం సదరు రాజకీయ నేతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాను ఏది చెబితే అది రాసుకుపోతున్న మీడియా వాళ్ల మాదిరిగా, ఏ విమర్శ చేసినా ఊరుకోవాలే తప్ప ఇలా నోటీసులు, పరువు నష్టాలు అంటారేంటి అంటూ అసహనంతో ఊగిపోతున్నారు.
తనది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ విమర్శలు హద్దులు దాటితే ఏమవుతుందో తెలుసుకోలేని అమాయకుడు ఏమీ కాదు. అయినా తమను ఏమీ చేయలేరనే ధీమా ఆయనకు ఇన్నాళ్లు ఉండి ఉండవచ్చు. కానీ ఇన్నాళ్లు ఒక్క లెక్క..ఇక నుంచి ఒక లెక్క అన్న చందంగా ఉన్నాయి ఇప్పటి ఏపీ రాజకీయాలు. అందుకే చంద్రబాబుకి ఊపిరిసలపడం లేదు. డ్రగ్స్ విషయంలో గుజరాత్ లో పట్టుబడితే ఏపీకి బంధం అంటగట్టేయత్నం చేశారు. కాకినాడ చుట్టూ కథ తిప్పాలని చూసి భంగపడ్డారు. అంతటితో పోతే సరిపోయేది కానీ నేరుగా డీజీపీ నుంచే పరువు నష్టం నోటీసులు రావడం బాబుకి మింగుడుపడడం లేదు. ఇలాంటి పరిస్థితి ఊహించి ఉండని చంద్రబాబు నిప్పులు తొక్కిన మనిషిలా చిందులు వేస్తున్నారు.
అందుకు తోడుగా గంజాయి అక్రమ రవాణాలో వైఎస్సార్సీపీ నేతలున్నారని నక్కా ఆనంద్ బాబు చేసిన కామెంట్స్ కి ఆధారాలు కావాలంటూ నర్సీపట్నం పోలీసులు ఆయన దగ్గరకి రావడంతో టీడీపీ నేతలు మరింత కుతకుతలాడిపోయారు. ప్రతీ విమర్శకు ఆధారాలు అడుగుతారా..తూచ్ అంటున్నారు. ఇలా అయితే ఎలా బాసూ అంటూ వెర్రెత్తిపోతున్నారు. తామేదో మాట్లాడుతాం..కానీ ఇలా పోలీసులు నోటీసులతో వచ్చేస్తే ఎలా అన్నది టీడీపీ నేతలకు మింగుడుపడని వ్యవహారం. జగన్ లక్ష కోట్లు తినేశారు..తినేశారు అంటూ తాము చేసిన ప్రచారం గుర్తు చేసుకుని ఇప్పుడు తల్లడిల్లిపోతున్నారు. ఇకపై అలాంటి నిరాధార ఆరోపణలు చేసిన సందర్భాల్లో నోటీసులు పట్టుకుని పోలీసులు వచ్చేస్తే ఇంకెలా అన్నదే టీడీపీకి అంతుబట్టని వ్యవహారం. ఇలా పదే పదే తమకు నోటీసులు, కేసులు అంటే వాటిని ఎదుర్కోవడం ఎలా అన్నదే వారికి బోధపడడం లేదు.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తాజాగా టీడీపీ ఆఫీసులో జరిగిన ఘటనలను ఉపయోగించుకుని డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించేశారు. ఘటన జరిగిన వెంటనే గవర్నర్ తో మాట్లాడడం, హోం మంత్రి ఆఫీసుతో మాట్లాడాము అంటూ టీడీపీ నేతలు పీలర్లు వదలడం హాస్యాస్పదంగా ఉంది. ఏకంగా కేంద్ర బలగాలను కోరారని, అమిత్ షా సానుకూలంగా స్పందించారని టీడీపీ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అసలు వాస్తవం తమకు అంత సీన్ లేదని టీడీపీ లో ప్రధాన నేతలందరికీ తెలుసు. అయినా ప్రజలను భ్రమల్లో పెట్టే యత్నాల్లో ఆరితేరిన బాబు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారు. కానీ ఏపీలో ఇకపై టీడీపీ నేతలు ఆరోపణలు చేసే సందర్భాల్లో ఆధారాలు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడం మాత్రం వారికి సంకటస్థితిని తెచ్చినట్టేనని భావించవచ్చు.