iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాల్లో ఎన్నడూ ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేని టీడీపీ తొలిసారి 2019లో ప్రయోగం చేసి పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ నుంచి పరోక్ష మద్దతు ఉన్నప్పటికీ నేరుగా పొత్తులు లేకుండా పోటీ చేసి భారీ ఓటమి చవిచూసింది. దాని నుంచి పాఠాలు నేర్చుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి మిత్రపక్షాలను సమకూర్చుకోవడానికే మొదటి నుంచి ప్రాధాన్యతనిస్తున్నారు. జనసేన , బీజేపీతో కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. దానికి అనుగుణంగా సంకేతాలు ఇచ్చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కూడా ప్రకటించారు. అయినప్పటికీ హస్తిన వచ్చి కూర్చున్న చంద్రబాబుకి మొఖం కూడా చూపించడానికి బీజేపీ నేతలు ససేమీరా అనడం వేరే సంగతి.
ఈ తరుణంలో తాజాగా టీడీపీ సీనియర్ నేత, మండలి మాజీ చైర్మన్ ఎం ఎం షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేన, లెఫ్ట్ పార్టీలతో కలిసి బరిలో దిగుతామని ఆయన ప్రకటించారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. మైనార్టీ నేతగా బీజేపీతో కలిసి సాగడం పట్ల అయిష్టతతో షరీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేక టీడీపీ అధిష్టానమే వ్యూహాత్మకంగా బీజేపీకి ఓ సంకేతంగా ఈ ప్రకటన చేయించిందా అన్నది చర్చనీయాంశం. తమతో పొత్తు కోసం బీజేపీ సిద్ధంగా లేకపోతే తమకు లెఫ్ట్ పార్టీలు రెడీగా ఉన్నాయనే హెచ్చరికను జారీ చేసినట్టుగా కొందరు సందేహిస్తున్నారు.
బీజేపీ, టీడీపీలను ఓ గూటికి చేర్చాలని బాబు సన్నిహితులు చాలామందే ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కండువా కప్పుకున్న సుజనా, సీఎం రమేష్ లు దాని కోసం చాలా శ్రమిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ ఉందనే సూచికలు జనంలోకి పంపించేందుకు అన్ని రకాల పాట్లు పడుతున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన సభ అందుకోసమే నిర్వహించినప్పటికీ తీరా సోము వీర్రాజు వ్యాఖ్యలతో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదనే అభిప్రాయం బీజేపీలో వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో టీడీపీ రెండు కుర్చీలాటకి సిద్దమవుతున్నట్టు చెప్పవచ్చు. లెఫ్ట్, రైట్ పార్టీలను రెండింటిలో ఒకరు తమ వెంట ఉంటారనే ధీమాతో ఆపార్టీ ఉందని చెప్పవచ్చు. రైట్ పార్టీ బీజేపీ కోసం బాబు గట్టిగా ప్రయత్నిస్తున్న వేళ లెఫ్ట్ నేతలకు షరీఫ్ మాటలు ఓ సంకేతంగా చెప్పవచ్చు.
రెండు వామపక్షాల్లో సీపీఐ ఇప్పటికే టీడీపీ కి అత్యంత సన్నిహితంగా మెలుగుతోంది. అయితే సీపీఎం మాత్రం ససేమీరా అంటోంది. కానీ ప్రస్తుతం సీపీఎం నిర్మాణపరంగా నాయకత్వంలో వచ్చిన మార్పులు టీడీపీకి ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. త్వరలో ఆపార్టీ నేతలు కూడా తమకు చేరువయ్యేందుకు అనుగుణంగా పరిణామాలున్నాయని టీడీపీ అంచనా వేస్తోంది. దాంతో బీజేపీ కాకుండా జనసేన, లెఫ్ట్ పార్టీలతో కలిసి సాగడం ఖాయమని అంచనా వేస్తోంది. గెలవాలంటే బీజేపీ మద్ధతు అవసరమని భావిస్తున్న టీడీపీ అందుకు అనుగుణంగా కమలం వైపు ఆశగా చూస్తోంది. కాదంటే మాత్రం కామ్రేడ్లతో జతగట్టే దిశలో ఆలోచిస్తోందని తాజా ప్రకటనలు చెబుతున్నాయి.
Also Read : హిందువులపై ప్రేమ ఒలకబోస్తున్న కళా