iDreamPost
android-app
ios-app

కూన తీరు మారునా..?

  • Published Apr 10, 2021 | 3:42 PM Updated Updated Apr 10, 2021 | 3:42 PM
కూన తీరు మారునా..?

అధికారం పోయినా.. ఆ దర్పం పోలేదు. పదవిలో ఉన్నా లేకపోయినా అతని నోటి దురుసుతనం, బెదిరింపులకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన టీడీపీ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తన తీరుతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పరారయ్యారు. అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కూన ఇంట్లో సోదాలు..

పోలింగ్ రోజు రాత్రి పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి తమ్మినేని మురళీకృష్ణ ఇంటిపై కూన సమక్షంలోనే అతని అనుచరులు దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్, గృహోపకరణాలు ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న కూన మురళీకృష్ణను బెదిరించారు. మళ్లీ బై ఎలక్షన్ వస్తుందిరా.. అంటూ పరోక్షంగా హతమారుస్తానన్నట్లు హెచ్చరించారు. అక్కడికి వచ్చిన పోలీసులను, డీఎస్పీ మహేందర్ తో సహా దూషించారు.

ఈ ఘటనలపై మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కూనను అరెస్టు చేసేందుకు శనివారం సాయంత్రం శ్రీకాకుళం నగరం శాంతినగర్లో ఉన్న ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో వెళ్ళారు. పోలీసులు ఏ సమయంలోనైనా తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన ఆయన శుక్రవారమే ఇంటి నుంచి పరారయ్యారు. దాంతో పోలీసుల ప్రయత్నం ఫలించలేదు.

దౌర్జన్యాలు, దూషణలు, కేసులు కొత్త కాదు..

హద్దుల్లేని రవికుమార్ ఆవేశం, నోటి దురుసుతనానికి ఆమదాలవలస నియోజకవర్గంలోని అధికారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు తరచూ బలవుతున్నారు. కూన అండ చూసుకొని టీడీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోతుండటంతో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. తనపై ఇప్పటికే ఇటువంటి పలు కేసులు ఉన్నాకూన దురాగతాలు ఏమాత్రం తగ్గడంలేదు.

Also Read : తిరుపతి సభ రద్దు.. మనస్సులు గెలుచుకున్న సీఎం జగన్‌

గతంలో తన అనుచరులు మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతుండగా పట్టుకున్నందుకు మండల మెజిస్ట్రేట్ అయిన పొందూరు తహసీల్దారుపై కూన చిందులు తొక్కారు. ‘బలిసిందిరా.. గొయ్యి తీసి పాతేస్తా’.. అంటూ రాయలేని భాషలో తిట్ల దండకం అందుకున్నారు. ఈ కేసులోనూ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొన్నాళ్ళు పరారీలో ఉండి.. ముందస్తు బెయిల్ తీసుకున్న తర్వాతే బయటకొచ్చారు.

పొందూరులో టీడీపీ కార్యాలయం నడుస్తున్న ఇంటి ఖాళీ చేయమని కోరిన ఇంటి యజమాని శివకుమార్ ను ఫోనులో బెదిరించారు. ఈ కేసులోనూ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నారు. పింఛన్ల విషయంలో తాను చెప్పినట్లు వినలేదని సరుబుజ్జిలి ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్సులను వారి కార్యాలయంలోనే తలుపులు మూసి కొడతానని బెదిరించారు.

గత ఆక్టోబరులో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పై ఫిర్యాదు చేసేందుకు నరసన్నపేట పోలీస్ స్టేషన్ కు అనుచరులతో వెళ్లిన కూన మూకుమ్మడిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన ఆయన వారిపై నోరు పారేసుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తాం. మిమ్మల్ని గుర్తుంచుకుంటాం.. అంతు చూస్తాం.. అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ సంఘటనలన్నింటిపైనా కూన కేసులు ఎదుర్కొంటున్నారు. అయినా కూన తీరు మాత్రం మారడం లేదు.

Also Read : చంద్రబాబుతో ఉన్న నేతలకు కరోనా.. టీడీపీ అధినేతకు ప్రమాదం లేనట్లేనా..?