Idream media
Idream media
సాధారణంగా రాజకీయ పార్టీల్లో కొన్ని విషయాలలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం ఉండడం మామూలే. అయితే అది పార్టీ కార్యకర్తల మధ్యో, లేదా ఓ స్థాయి నేతల మధ్యో అయితే పర్వాలేదు. కానీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు/అధినేత వేర్వేరుగా మాట్లాడితే అది ఎన్నో రకాల అర్థాలకు దారి తీస్తుంది. ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలది అదే తీరు కనిపిస్తోంది. ఒకరేమో కరోనా తగ్గిపోయింది ఎన్నికలు పెట్టొచ్చు అంటారు.. ఇంకొకరేమో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంటుంది అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తారు.. దీన్ని ఏమనుకోవాలో విన్నవారికే కాదు.. పార్టీ శ్రేణులకే పాలుపోవడం లేదు. ఏదో విధంగా ప్రభుత్వం చెబుతున్న దాన్ని, చేస్తున్నదాన్ని వ్యతిరేకించడమే ప్రతిపక్షం పని అనుకుంటున్నా.. ఇద్దరూ ఒకే మాట మీద ఉండాలి కదా.. అనేది ఇప్పుడు ప్రశ్న.
అక్టోబర్ 8న కరోనా వారియర్స్ తో సమావేశంలో చంద్రబాబు..
‘‘కరోనా మహమ్మారి రెండోసారి తిరగబెడుతోంది. ఆసియా దేశాల్లో రెండోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండోసారి కరోనా సోకిన వారిలో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పోస్టు కోవిడ్‌ను ఎదుర్కోవడంపైనే అందరి భవిష్యత్ ఆధారపడి ఉంది. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మద్యం దుకాణాలు, స్కూళ్లు తెరుద్దామనే ఉత్సాహంతో ఉన్నారు. సాక్ష్యాత్తూ ప్రధాని జాగ్రత్తలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వినడం లేదు. ఇది సరికాదు. కరోనా సమస్యకు ఇప్పుడిప్పుడే పరిష్కారం లభించే సూచనలు లేవు. ఈ సమస్యను అధిగమించడం పెద్ద సవాల్‌తో కూడుకున్నది.’’ ఇవి సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కరానో వారియర్స్ తో వెబినార్ లో పలికిన పలుకులు. కరోనా సమస్యకు ఇప్పట్లో పరిష్కారం లభించే అవకాశాలు లేవని స్పష్టంగా చెప్పారు.
అక్టోబర్ 28న ఈసీ/మీడియా సమావేశాల్లో అచ్చెన్నాయుడు
‘‘కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుంటే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నారు. ప్రాంతాలు, కులాల మధ్య తగాదాలు సృష్టించడం, సంక్షేమం లేకపోవడంతో, ఈ సమయంలో ఎన్నికలు పెడితే దెబ్బతింటామని వైసీపీ భావిస్తోంది. కేంద్ర బృందాలతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరాం. నామినేషన్ ఆన్ లైన్‌లో ఫైల్ చేసే అవకాశం ఇవ్వాలన్నాం. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. కొవిడ్ నిబంధనలు పాటించి ఎన్నికలు నిర్వహించాలని తెలిపాం. ఎన్నికలను వాయిదా వేయడాన్ని ప్రజలు స్వాగతించరు.’’ ఇవి తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీ సమావేశంలోను అనంతరం మీడియా సమావేశాల్లో చెప్పిన మాటలు. కరోనా తగ్గుముఖం పడుతుండడంతో తాము ఎన్నికలు పెట్టాలని కోరినట్లు చెప్పారు.
ఏ ఉద్దేశానికీ రాజకీయాలు…
ఒకరు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మరొకరు అదే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. ఇద్దరూ పార్టీలో అగ్రశ్రేణి నాయకులే. కానీ వారి మాటల తీరు అవకాశవాద రాజకీయాలను స్పష్టం చేస్తోంది. మంచైనా, చెడైనా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకోవడమే తప్పా.. బాధ్యతాయుతమైన కర్తవ్యం టీడీపీలో కనిపించడం లేదనడానికి ఇదే నిదర్శనం. పోనీ చంద్రబాబు చెప్పింది 20 రోజుల క్రితమే అనుకున్నా.. అప్పటి కన్నా ఇప్పుడే సెకండ్ వేవ్ చాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోనీ కరోనా ఏపీలో పూర్తిగా తగ్గిపోయిందా అంటే అంతగా లేదని రోజూ నమోదవుతున్న కేసులను బట్టి అర్థమవుతోంది. జాతీయ అధ్యక్షుడు చెప్పింది రాష్ట్ర అధ్యక్షుడు ఫాలో అవుతున్నాడా? లేక రాష్ట్ర అధ్యక్షుడు చెప్పింది జాతీయ అధ్యక్షుడు ఫాలో అవుతున్నాడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎవరికీ అర్థం కాకుండా ఇలాగే టీడీపీ రాజకీయాలు కొనసాగితే.. ఏపీలో టీడీపీ అంటేనే అర్థం వెదుక్కోవాల్సిన దుస్థితి వచ్చే పరిస్థితులు ఉన్నాయి.