iDreamPost
iDreamPost
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం ఎప్పుడూ చర్చనీయాంశం అవుతుంటుంది. ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే ఆయన యత్నం కొన్ని సార్లు శృతిమించుతుంది. చివరకు ప్రజలే ఆయన మీద తిరగబడేలా చేస్తుంది. గతంలో రాజమహేంద్రవరంలో ఇళ్ల కేటాయింపు విషయంలో అతి చేసిన సందర్భంలో ప్రజలు ఆయన్ని తరిమిన సంగతి అందరికీ తెలిసిందే.
బుచ్చయ్య చౌదరి ఏపీ అసెంబ్లీకి ఆరు సార్లు గెలిచిన కొద్ది మంది ఎమ్మెల్యేలలో ఒకరు. 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ హయంలోనే మంత్రి పదవి అనుభవించారు. కానీ తర్వాత ప్రారంభంలో చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తో కలిసి నడిచిన బుచ్చయ్యని బాబు ఇప్పటికీ విశ్వసించడం లేదు. అందుకు తగ్గట్టుగానే పదే పదే గెలిచినా కీలక సందర్భాల్లో ఆయన్ని పక్కన పెడుతున్నారు. గత ప్రభుత్వంలో మంత్రి పదవి విషయంలో కూడా బుచ్చయ్య తనకు అన్యాయం జరిగిందని బహిరంగంగానే వాపోయారు. చంద్రబాబు మీద చిందులేశారు. బాబుకి లేఖ రాస్తూ తీవ్ర పదజాలంతో విమర్శలు కూడా గుప్పించారు. అయినా చివరకు తమ సామాజికవర్గానికే చెందిన కొందరు పెద్దల జోక్యంతో చల్లబడి మళ్లీ సర్థుకుపోవడం ప్రారంభించారు.
ప్రస్తుతం టీడీపీ విపక్షంలో ఉండడంతో చంద్రబాబుకి బుచ్చయ్య లాంటి సీనియర్ల అవసరం పెరిగింది. దానికి అనుగుణంగానే ఆయన్ని శాసనసభాపక్ష ఉపనేతగా ఎంపిక చేశారు. దాంతో తనను అధినేత గుర్తించారని రెచ్చిపోతున్న బుచ్చయ్య అటు మీడియా ముందు ఇటు సోషల్ మీడియాలో కూడా కొంద దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. చివరకు బ్రదర్ అనిల్ కి, జీవీఎల్ కి బంధుత్వం అంటగట్టే ప్రయత్నంలో అభాసుపాలయ్యారు. అంతకుముందు పట్టిసీమ మీద ఉండవల్లితో బహిరంగచర్చకు సిద్దమని చెప్పి వెనక్కి తగ్గిన బుచ్చయ్య ఇప్పుడు కూడా బ్రదర్ అనిల్ బంధుత్వం విషయంలో నిరాధార ఆరోపణలు చేసి మళ్లీ సైలెంట్ అయిపోవడం గమనార్హం
చంద్రబాబు బాటలోనే తమకు గిట్టని వారిపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత మిన్నకుండిపోవడం బుచ్చయ్య కూడా అలవాటు చేసకున్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటున్నాయి. అనే క సందర్భాల్లో విమర్శనాత్మకంగా కాకుండా బురదజల్లడమే తమ కర్తవ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతల తీరుకి తగ్గట్టుగానే బుచ్చయ్య కూడా వ్యవహరిస్తున్నారు. అంత సుదీర్ఘ అనుభవం కలిగిన నేత కూడా నిస్సిగ్గుగా చేస్తున్న వ్యాఖ్యలు, పోస్టులకు సమాధానం చెప్పాల్సి ఉన్నప్పటికీ దూరం జరగడం ఆయన నైజాన్ని చాటుతుందనే అభిప్రాయం బలపడుతోంది. ఏదో రకంగా వార్తల్లో ఉండడం, ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే తప్ప బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే విషయాన్ని ఆయన విస్మరించినట్టు పలువురు భావిస్తున్నారు.