Idream media
Idream media
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటామన్న చందంగా ఉంది ఏపీలో టీడీపీ నేతల పరిస్థితి. చంద్రబాబు ఏమి చేశారో తాము చూపిస్తామని, వైసీపీ ప్రభుత్వం 15 నెలల్లో ఏమి చేసిందో చెప్పాలంటూ టీడీపీ నేతలు సవాళ్లు విసురుతున్నారు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ముద్ర శాశ్వతంగా ఉందంటూ తమ అధినేతను ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. ప్రతిష్టాత్మకంగా అమరావతి నిర్మాణం చేపట్టారని చెప్పుకొస్తున్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ రాష్ట్రానికే మణిహారంగా నిలవబోతోందంటున్నారు.
కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆ క్రెడిట్‌ను పూర్తిగా చంద్రబాబు ఖాతాలో వేసేందుకు బొండా ఉమా ప్రయత్నిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు ద్వారా తెలుస్తోంది. అందుకే మూస పద్ధతిలోనే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దారని, హైదరాబాద్‌లో చంద్రబాబు హాయంలోనే ఫ్లై ఓవర్లు, రింగు రోడ్డు వచ్చిందంటూ చెబుతూ.. దుర్గగుడి కూడా ఆయన హాయంలోనే పూర్తయిందనే సంకేతాలు ఇస్తున్నారు. బాబు హాయంలోనే దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తయితే అప్పుడు బాబే ఎందుకు ప్రారంభించలేదన్న ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడంతో 15 నెలలకు పూర్తయిందన్న విషయం బెజవాడ వాసులుకు తెలియదని స్థానిక మాజీ ప్రజా ప్రతినిధి అయిన బొండా భావిస్తున్నారేమోనన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది.
అమరావతి కట్టామని, దుర్గగుడి ప్లై ఓవర్ పూర్తి చేశామని, ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు శాశ్వత ముద్ర ఉందని ఎన్నికల వేళ చంద్రబాబతో సహా టీడీపీ నేతలు ఎందుకు చెప్పుకోలేకపోయారన్న సందేహం రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. బాబు శాశ్వత ముద్ర ఏమిటో ఎన్నికల్లో చెప్పుకుని ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల అధికారంలో చేసింది ఏమీ లేకపోవడంతో.. 2014లో మాదిరిగానే 2019లోనూ జగన్‌పై అవే అరోపణలు చేశారు. అందుకే బొక్క బోర్లా పడ్డామన్న విషయం బోధపడింది.
అందుకే ఇప్పుడు బాబు అభివృద్ధి చేశాడు.. మేము చూపిస్తాం.. అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూపించి ఏం లాభం అనేదే మౌలిక ప్రశ్న.
అందుకే ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చేయాలని చెబుతుంటారు. బాబు చేసిన అభివృద్ధి చూపించాల్సింది ఎన్నికల్లో.. ఇప్పుడు చూపించడం వల్ల ఏం లాభమో బోండా ఉమా తనకు తానే ప్రశ్నంచుకుంటే సమాధానం లభిస్తుందనే సలహాలు వస్తున్నాయి.