iDreamPost
android-app
ios-app

వైఎస్‌ని తిడుతున్నారంటూ జేసీ ఆవేదన..!

వైఎస్‌ని తిడుతున్నారంటూ జేసీ  ఆవేదన..!

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు సాగుతుంటాయనేది వాస్తవం. టీడీపీ ప్రభుత్వ హాయంలో అనంతపురం జిల్లాలో చక్రం తిప్పిన జేసీ కుటుంబం.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా సాక్షి కథనాలు రాస్తే.. అనంతపురం యూనిట్‌ కార్యాలయం మందు కూర్చుని వైఎస్‌ జగన్‌ను, ఆయన కుటుంబాన్ని జేసీ ప్రభాకర్‌ రెడ్డి రాయలేని భాషలో తూలనాడారు. అలాంటి వ్యక్తి ఈ రోజు వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఎనలేని ప్రేమను చూపుతుండడం వైఎస్‌ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

వైఎస్‌ఆర్‌ను దూషించొద్దు..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. వైఎస్‌ఆర్‌ను ఉద్దేశించి రాక్షసుడు అంటూ సంబోధించారు. నీటి విషయంలో వైఎస్సార్‌ తెలంగాణకు అన్యాయం చేశారనేది శ్రీనివాస్‌ గౌడ్‌ భావన. వైఎస్‌ఆర్‌ను శ్రీనివాస్‌ గౌడ్‌ రాక్షసుడు అనడంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భౌతికంగా లేని వ్యక్తి గురించి అన్ని మాటలు అనొచ్చా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోమారు ఇలా మాట్లాడొద్దంటూ చేతులు జోడించి తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను కోరుతూ వార్తల్లో నిలిచారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి. అదే సమయంలో.. వైఎస్సార్‌ను దూషిస్తుంటే ఏపీ మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read : ప్రాజెక్టుల నిర్మాణం మీద ఫిర్యాదు చేసింది రైతులా ?టీడీపీ నేతలా ?

వైఎస్సార్‌ అంటే ప్రేమంట..

వైఎస్సార్‌ను ఉద్దేశించి జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి గారు పెద్దమనిషి అంటూ అభివర్ణించారు. వైఎస్సార్‌ను తాము ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేదని జేసీ ప్రభాకర్‌ రెడ్డి చెప్పడం విశేషం. వైఎస్‌ పలకరింపులోనే నాయకుడు ఉండేవారని కొనియాడారు. ఈ తరహాలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి వ్యవహరిస్తుండడంపై జేసీ బ్రదర్స్‌ రాజకీయాలను గమనించే వారు పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు చేయడంలో జేసీ బ్రదర్స్‌ది అందవేసిన చేయి అంటూ చెబుతున్నారు.

మున్సిపల్‌ పోరు తర్వాత మారిన తీరు..

ఫోర్జరీ పత్రాలతో వాహనాలను విక్రయించిన కేసులో జైలు పాలైన సమయంలో.. వైఎస్‌ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జేసీ బ్రదర్స్‌.. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత తమ రూటును మార్చారు. తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలవడం, జేసీ ప్రభాకర్‌ రెడ్డి చైర్మన్‌ అయినప్పటి నుంచి వారి తీరు మారింది. వైఎస్‌ జగన్‌ నీతివంతమైన రాజకీయాలు చేయడం వల్లనే తాను మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యానని జేసీ ప్రభాకర్‌ రెడ్డి నాడు చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సీఎం వైఎస్‌ జగన్‌ను కలుస్తానంటూ అప్పట్లో చెప్పారు. నాడు వైఎస్‌ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. ఇప్పుడు వైఎస్‌ఆర్‌పై ప్రేమను కురిపిస్తుండడం.. పరిస్థితిని బట్టి రాజకీయాలు చేస్తారనే మాటను గుర్తుచేస్తున్నారు.

Also Read : ఈటల రాజేందర్‌ వెనుక మోదీ ఉన్నారట..!