iDreamPost
iDreamPost
దాదాపు 40 ఏళ్ల క్రితం తెలుగునాట ఒక ప్రభంజనంలా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నేడు రాజకీయంగా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు కృషితో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన టీడీపీ.. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చర్యలతో నానాటికి జనంలో పలుచనైపోతోంది. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు ఓటర్లు ఆ పార్టీని పరిమితం చేసినా అధినేత చంద్రబాబు తన వైఫల్యాలను, వ్యూహాలను సమీక్షించుకోవడానికి బదులు జనానికే శాపనార్థాలు పెట్టడం, ప్రతిపక్షంగా క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీని నడిపించకుండా హైదరాబాద్‌కే పరిమితం కావడం పెద్ద లోపంగా పరిణమించాయి.
కాలం చెల్లిన రాజకీయాలతో..
దాదాపు 50 శాతం ఓట్లతో 151 సీట్లతో విజయఢంకా మోగించిన వైఎస్సార్ సీపీని బాబు తక్కువగా అంచనా వేశారు. సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా రూపొందించిన నవరత్నాలతో వైఎస్సార్ సీపీ జనంలోకి దూసుకుపోతుంటే కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే తన పని అన్నట్టు బాబు వ్యవహరించారు. దీనికితోడు కుట్రలతో కుల, మత విద్వేషాలు రగల్చడం, తన అనుంగు మీడియాతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారు. తానెన్ని కుట్రలు చేసినా జనం గమనించడంలేదనే భ్రమతో అయన తప్పు మీద తప్పు చేస్తూ ప్రజాకోర్టులో సాక్ష్యాలతో సహా దొరికిపోయి అడ్డంగా బుక్కయ్యారు. అందుకే గడచిన పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దాదాపు 85 శాతం పంచాయతీల్లో వైఎస్సార్ సీపీకి పట్టం గట్టి బాబుకు, ఆయన పార్టీకి పెద్ద శిక్ష విధించారు.
Also Read: వచ్చే ఎన్నికలకు అయ్యన్న ఔటేనా!
తన సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఆ పార్టీ మెజార్టీ పంచాయతీలను ఓడిపోయిందంటే ఓటర్లు ఆ పార్టీపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమవుతుంది. వియ్యంకుడు బాలకృష్ణ ఇలాకా హిందూపురంలో ఇదే పరిస్థితి. పార్టీ అధ్యక్షుడు అచ్చెన్ననాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణమూర్తి, దేవినెని ఉమ ఎప్పట్నుంచో ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అంతర్మథనం మొదలైంది. ‘తెలుగుదేశం మునుగుతోంది పో వదలి పో’ అనుకునే రీతిలో ఒకరికొకరు పిలుపునిచ్చుకుంటూ పార్టీని వీడడానికి సిద్ధపడుతున్నారు. కొందరు వేరే పార్టీల్లోకి జంప్ చేయడానికి మంతనాలు సాగిస్తుండడం ప్రస్తుత తెలుగుదేశం పరిస్థితికి అద్దం పడుతోంది.
పనిచెయ్యని బాబు చాణక్యం..
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారని, ఆయన ఎత్తుగడలతో పార్టీ భవిష్యత్తుకు ఢోకా లేదని ఇన్నాళ్ళూ బాబుపై తెలుగు తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలు ఆడియాసలేనని గడచిన రెండున్నరేళ్లలో ఒకటికి రెండుసార్లు రుజువయింది. కాలం చెల్లిన ఆయన ఎత్తులు ప్రస్తుత సంక్షేమ రాజకీయాల్లో చిత్తవుతున్నాయి. ఆయన వారసుడు, ప్రస్తుత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సారధ్యంపై కూడా ఎవరికి నమ్మకం లేకపోవడం కూడా పలువురు పార్టీ వీడాలని నిర్ణయించుకోవదాని కి కారణం అవుతోంది. లోకేష్ ఇటీవల తన మేకోవర్ తో స్లిమ్ అయినప్పటికీ పార్టీకి మాత్రం కొత్త రూపు, ఊపు తీసుకు రాలేకపోతున్నారు. సందర్భ శుద్ది లేకుండా ప్రభుత్వాన్ని, అధికారపార్టీ నేతలను తీవ్రమైన, అభ్యంతర కరమైన పదజాలంతో దూషించడమే రాజకీయమని భావించడం పార్టీకి నష్టంగా పరిణమిస్తోంది. అందుకే ఇటీవల ఒక సందర్భంలో ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్ననాయుడు చెప్పినట్టు తెలుగుదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.
Also Read : పెద్దిరెడ్డి మీద పోటీకి కొత్త “బాబు”ను సిద్ధం చేసిన చంద్రబాబు…