iDreamPost
iDreamPost
ఉమ్మడి ఏపీతోపాటు..విభజిత ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు అధికారంలో.. కొన్నిసార్లు ప్రధాన ప్రతిపక్ష పాత్రల్లో కొనసాగిన తెలుగుదేశం పార్టీకి గత రెండు దశాబ్దాల్లో గెలుపు రుచి చూపించని నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా 2004 నుంచి 2019 వరకు జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమతోపాటు దాన్ని అనుకొని ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 30 పైగానే అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీకి ఏమాత్రం అచ్చి రాలేదు. ఆ నియోజకవర్గాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎందరు అభ్యర్థులను మార్చినా ఆ పార్టీ గెలుపు తీరం చేరలేకపోతోంది. గతంలో వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌కు,తర్వాత జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీకి ఆ నియోజకవర్గాలు పట్టుగొమ్మలుగా మారడమే దీనికి కారణం. అటువంటి నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఒకటి. ప్రస్తుతం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచీ టీడీపీకి చేదు ఫలితాలనే రుచి చూపిస్తోంది.
2009 నుంచీ అదే వరస
నియోజకవర్గాల పునర్విభజనతో ఏర్పడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 2009లో తొలిసారి ఎన్నికలు జరిగాయి.అప్పటి నుంచీ ఇక్కడ టీడీపీకి ఓటమి తప్పడం లేదు. 2009లో వైఎస్ హవాతో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఎర్రగొండపాలెంలో కూడా కాంగ్రెసే విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి బరిలోకి దిగిన ఆదిమూలపు సురేష్ టీడీపీ అభ్యర్థి పాలపర్తి డేవిడ్ రాజుపై గెలిచారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన డేవిడ్ రాజు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ మాత్రం ఓటమి పాలైంది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినబూదాల అజితారావు డేవిడ్ రాజు చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గంలో ఎవరికీ తెలియని అజితా ఓటమి తర్వాత కూడా స్థానికంగా ఉండకుండా పోయారు. అయినా 2019 ఎన్నికల్లో పార్టీ అధినేత మళ్లీ ఆమెకే టికెట్ ఇచ్చారు. మరోవైపు వైఎస్సార్సీపీ నుంచి ఆదిమూలపు సురేష్ బరిలోకి దిగి అజితా రావును ఓడించారు. ఆయనకు ఇది రెండో విజయం కాగా ఆమెకు వరుసగా రెండో ఓటమి.. టీడీపీకి హ్యాట్రిక్ ఓటమి కావడం విశేషం.
ఇంఛార్జిగా స్థానికేతరుడు
వరుస ఓటములతో నియోజకవర్గంలో కుదేలైన పార్టీని తిరిగి నిలబెట్టేందుకు అధిష్టానం పెద్దగా శ్రద్ధ చూపడంలేదని టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం, పరిచయాలు లేని అజితా రావును తీసుకొచ్చి చేతులు కాల్చుకున్న అధిష్టానం ఇప్పుడు వేరే నియోజకవర్గ నేతను తీసుకొచ్చి తమపై రుద్దిందని విమర్శిస్తున్నారు. రెండు నెలల క్రితమే నియోజకవర్గ ఇంఛార్జిగా గూడూరు ఎరిక్సన్ బాబును నియమించారు. అయితే ఆయనది ఈ నియోజకవర్గం కాదు. పక్కనున్న కనిగిరికి చెందిన ఆయన వల్ల ఇక్కడ పార్టీకి ఉపయోగమేమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా మంత్రి హోదాలో ఆదిమూలపు సురేష్ అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఆయన్ను ధీటుగా ఎదుర్కోవాలంటే స్థానికంగా ఉంటూ పార్టీకి, కార్యకర్తలకు అండగా నిలిచే నేత అవసరమని అంటున్నారు. లేదంటే మరో ఓటమి తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : నవరత్నాలపై కళా అవగాహన ఇంతేనా?