iDreamPost
iDreamPost
ఏదో చేయాలనుకుంటే ఇంకేదో అయినట్లుంది తెలుగుదేశం పరిస్థితి. వైఎస్సార్సీపీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతి చిన్న విషయంలోనూ కార్నర్ చేస్తూ ఇరకాటంలో పెట్టాలని తాపాత్రయపడుతున్న టీడీపీ తానే బొక్కబోర్లా పడుతోంది. తాజాగా డ్రగ్స్ కేసులో అదే జరిగింది. రాష్ట్రంతో ఏమాత్రం సంబంధం లేని ఈ కేసులో అధికార పార్టీ నేతలకు సంబంధాలు ఉన్నాయని లింకులు కలుపుతూ కొద్దిరోజులుగా కల్పిత ఆరోపణలు చేస్తున్న టీడీపీకి రెండు అంశాలు డిఫెన్సులో పడేశాయి.
డ్రగ్స్ కేసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని స్వయంగా కేంద్ర హోంశాఖ స్పష్టం చేయడం టీడీపీ ఆరోపణల్లోని డొల్లతనాన్ని బయట పెట్టగా.. ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి మరో అడుగు ముందుకు వేసి కాకినాడ మత్స్యకారులతో దీనికి లింకు పెట్టడంతో ఆ సామాజికవర్గీయుల ఆగ్రహానికి టీడీపీ గురి కావాల్సి వచ్చింది. ముఖ్యంగా టీడీపీకి చెందిన స్థానిక మత్స్యకార నాయకుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైంది. అదే సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంఛార్జి వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) ఇంతవరకు వివాదంపై స్పందించకపోవడం గమనార్హం.
తలలు పట్టుకుంటున్న తూగో నేతలు
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ ఉదంతాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకొని గల్లీ స్థాయి నేతల వరకు దాన్ని వైఎస్సార్సీపీ నేతలకు అంతగట్టడానికి పోటీ పడ్డారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అత్యుత్సాహంతో కాకినాడకు వెళ్లి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని మత్తు ఆరోపణల్లో ఇరికించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కిందా మీదా చూడకుండా మత్స్యకారవర్గంపైనా ఆరోపణలు చేశారు. కాకినాడ తీరంలో ఫిషింగ్ బోట్ల ద్వారా మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి తరలిస్తున్నారని ఆరోపించారు. ముంద్రా పోర్టులో డ్రగ్స్ పట్టుబడిన సెప్టెంబర్ 17కు ముందే జరిగిన బోటు దగ్ధం ఘటనను సైతం మత్తుకు ముడిపెట్టారు.
Also Read : పవన్ కు మిత్రుడు టీడీపీనా, బీజేపీనా?
దీంతో మెకనైజ్డ్ బోట్ల యజమానులు, వాటిపైనే ఆధారపడిన మత్స్యకారులు ఆగ్రహోదగ్రులయ్యారు. కాకినాడ టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టాభి చేసిన నిరాధార ఆరోపణలను అందిపుచ్చుకున్న ధూళిపాళ్ల నరేంద్ర, వర్ల రామయ్య తదితర టీడీపీ నేతలు కూడా రెచ్చిపోయారు. ఇవన్నీ మత్స్యకార సామాజికవర్గంలో అలజడి రేపాయి. టీడీపీపై ఆ వర్గీయులు మండిపడుతున్నారు. తమపై లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల పోలీసులకు టార్గెట్ అవుతామని, సోదాల పేరుతో ఇబ్బంది పడటమే కాకుండా తమ జీవనాధారమైన మత్స్య వేటకు అంతరాయం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితికి కారకులైన టీడీపీ నేతలు తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని మెకనైజ్డ్ బోటు యజమానుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
చిక్కుల్లో టీడీపీ మత్స్యకార నేతలు
ఈ పరిణామాలపై జిల్లా టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో టీడీపీకి అండగా నిలిచిన మత్స్యకారులు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చారు. అప్పుడు దూరమైన మత్స్యకార వర్గాన్ని మళ్లీ దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పట్టాభి ఓవర్ యాక్షన్ వల్ల వారు మరింత దూరమయ్యారని అంటున్నారు. బయట నుంచి వచ్చిన నేతలు చేసిన రచ్చతో ఆ వర్గానికి చెందిన స్థానిక టీడీపీ నేతలు ఇబ్బందుల్లో కురుకుపోయారు. కాకినాడ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన మత్స్యకార నేతలే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన వర్గం మద్దతుతోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీ ఇంఛార్జిగా ఉన్నారు. ఇక కాకినాడ నగరపాలక సంస్థలో టీడీపీ మత్స్యకార నేతలు కార్పొరేటర్లుగా ఉన్నారు.
Also Read : టీడీపీ ఆ పని మానేసిందట.. ఆ విషయం మరచిపోయిందట..
పట్టాభి బ్యాచ్ మత్స్యకారులపై చేసిన ఆరోపణలు వీరందరికీ మింగుడుపడని విధంగా ఉన్నాయి. పార్టీ పక్షాన నిలబడి ఉత్తుత్తి ఆరోపణలను సమర్థిస్తే సొంత సామాజికవర్గం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. సామాజికవర్గం వైపు నిలబడితే పార్టీ అధిష్టానం కన్నెర్ర చేస్తుందేమోనని భయం. ఎటు నిలబడాలో అర్థం కాక మాజీ ఎమ్మెల్యే వనమాడితో సహా ఇతర నేతలు ఇంతవరకు దీనిపై స్పందించలేదు. బయటి నేతల వాచాలత్వంతో తాము ఇబ్బందుల్లో చిక్కుకున్నామని వారు మాధనపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా జిల్లాలో మాజీ హోంమంత్రి చినరాజప్ప, జ్యోతుల నెహ్రు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి అనేకమంది సీనియర్ నేతలు ఉన్నారు. ఏదైనా ఉంటే వారితో మాట్లాడించకుండా విజయవాడ నుంచి పట్టాభి లాంటి మైకాసురులను పంపి పీకల మీదికి తెచ్చుకున్నారని టీడీపీ కార్యకర్తలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకార వర్గం దూరం
తూర్పు గోదావరి జిల్లాతో పాటు రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో మత్స్యకార సామాజికవర్గీయులు గణనీయంగా ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో వారి ఓట్లే పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. అంతకుముందు టీడీపీ వైపు ఉన్న ఈ సామాజికవర్గీయులు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి దన్నుగా నిలిచారు. డ్రగ్స్ ఉదంతంలో టీడీపీ వారిపైనే ఆరోపణలు ఎక్కుపెట్టి ఇబ్బంది పెట్టడంతో మత్స్యకారులు టీడీపీకి మరింత దూరం అయ్యారని స్పష్టం అవుతోంది. మత్స్యకారులు గణనీయంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది టీడీపీకి రాజకీయంగా చేటు చేస్తుందన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
Also Read : పార్టీలన్నీ ఒకవైపు …. టిడిపి మరోవైపు ! బిజెపి అంటే భయమా భక్తా ?