ఎన్నికలు పెట్టండి.. ఎన్నికలు పెట్టండి.. అంటూ తెగ ఆరాటపడ్డ తెలుగుదేశం నేతలు అందరూ ఇప్పుడు అపసోపాలు పడుతున్నారు. నామినేషన్లు వేయించుకునేందుకు, మద్దతుదారులను గెలిపించుకునేందుకు నానా అవస్థలూ పడుతున్నారు. ఎన్ని అడ్డదారులైనా తొక్కుతున్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలు, నిబంధనల ఉల్లంఘన ఇలా ఎన్నో సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా తమ సొంత జిల్లా, గ్రామాల్లో పరువు నిలబెట్టుకోవడం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. తప్పటడుగులు వేస్తూ జైలుపాలవుతున్నారు. కేసుల్లో చిక్కుకుంటున్నారు. కేసుల్లో ఇరుక్కుంటున్న వారి లెక్క పెరుగుతున్నప్పుడల్లా టీడీపీ అధినేత చంద్రబాబులో అసహనం పెరిగిపోతోంది. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్పా.. నిబంధనలు ఉల్లంఘించి కేసుల్లో ఇరుక్కోవద్దంటూ తమ పార్టీ నేతలకు చెప్పడం లేదు. పైగా న్యాయం చేయండంటూ కోర్టులకెక్కుతున్నారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ లో రసవత్తర రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించిన కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడు జైలుకెళ్లిన విషయం తెలిసిందే. సొంత గ్రామంలో ఒక వేళ ఓడిపోతే అన్న భయంతో ప్రత్యర్థిని బెదిరించడం ద్వారా నామినేషన్ ఉపసంహరించేలా ప్రయత్నాలు చేశారు. ఆ కేసులో అరెస్టయిన అచ్చెన్నకు 14 రోజులు కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. బెయిలుపై వచ్చిన అచ్చెన్నకన్నీళ్లు కార్చుతూ స్థానికుల సానుభూతి పొందే ప్రయత్నం చేశారు కానీ స్పీడు తగ్గించేనట్లే కనిపిస్తున్నారు. అచ్చెన్న సంగతి అలా ఉంచితే ప్రతి జిల్లాలనూ టీడీపీ నేతల రాజకీయాలు ఇబ్బందులను సృష్టిస్తూనే ఉన్నాయి.
తాజాగా కృష్ణా జిల్లా పామర్రు పెరిసేపల్లి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. మాస్క్ పెట్టుకోలేదన్న నెపంతో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారు. కొత్త నిమ్మకూరులో టీడీపీ నేత బరితెగించారు. వృద్ధురాలితో బూత్‌లోకి వెళ్లి ఓటు వేసేందుకు టీడీపీ నేత ప్రయత్నించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో సర్పంచ్ అభ్యర్ధిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. కృష్ణపల్లి కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్ధిపై దౌర్జన్యానికి దిగారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో నామినేషన్ల దాఖలు సందర్భంగా శుక్రవారం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. నామినేషన్ కేంద్రానికి వంద మీటర్లలోపు జనం గుమికూడరాదనే నిబంధనలున్నా అనుచరులతో హడావుడి చేశారు. పార్టీ కండువాలు వేసుకుని నామినేషన్లు దాఖలు చేసినా అధికారులు పట్టించుకోలేదు.
ఇప్పుడు ఏకంగా ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి కూడా రాజకీయాలు ప్రారంభించారు. బాబు తరఫున ఒకాల్తా పుచ్చుకున్నారో ఏమో చిత్తూరు జిల్లా కుప్పం మండలం వేపూరు మిట్టపల్లి గ్రామ పంచాయతీకి వైసీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన అంజలిని బెదిరింపులకు గురి చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు మనోహర్ పై కేసు నమోదైంది. వేపూరు మిట్టపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసిన శివలక్ష్మి భర్త మంజునాథ్ మనోహర్ లు నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే చంపుతామని బెదిరించారని బాధితురాలు అంజలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు మంజునాత్ తోపాటు చంద్రబాబు పీఏ మనోహర్ లపై ఐపీసీ 448 323 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై కూడా ఇలానే కేసు నమోదైంది. వైసీపీ తరుఫున బరిలోకి దిగిన తన అన్న కొడుకును బెదిరించిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తాజాగా చంద్రబాబు పీఏకు అదే పరిస్థితి పట్టడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచీ టీడీపీ రాజకీయాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి.