iDreamPost
iDreamPost
అదే ఉక్రోషం.. అదే ఆక్రోశం.. రాష్ట్ర ప్రభుత్వంపై రోజూ ఏదో ఒక ఆరోపణ చేయకపోతే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ రోజు నిద్రపట్టదు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా జరిగేవాటిని కూడా వదలకుండా అవాస్తవాలతో ఏదో జరిగిపోతోందన్నట్లు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా మరోమారు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, అప్పులపై చంద్రబాబు విషం వెళ్లగక్కారు. గురివింద గింజ తన నలుపు ఎరగదన్న రీతిలో తన పాలనలో చేసిన వాటిని విస్మరించి.. ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి, అమ్మేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి తానే చివరి సీఎంను అన్నట్లు జగన్ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని ఆరోపించారు. రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేశారని గగ్గోలు పెట్టారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏకంగా ప్రభుత్వరంగ సంస్థలనే కొల్లగొట్టి అమ్మేశారు. అప్పులు చేసి హంగు ఆర్భాటాలకే వెచ్చించారు.
ఆ పరిశ్రమల ఉసురు తీసింది మీరు కాదా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రలోనూ ప్రభుత్వ సంస్థలు, ఆస్తులను విచ్చలవిడిగా అమ్మేశారు. టీడీపీ జమానాలో సుమారు 54 రాష్ట్రప్రభుత్వరంగ సంస్థలను అమ్మేశారు. నిజాం సుగర్స్ తోపాటు సహకార రంగంలో ఉన్న 12 చక్కెర కర్మాగారాల ఉసురు తీసేశారు. వందల కోట్ల విలువైన వాటి స్థలాలను కారుచవకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. హైదరాబాద్ లోని ఆల్విన్ వాచ్ కంపెనీ, పలు స్పిన్నింగ్ మిల్లులు, పేపర్ మిల్లులు టీడీపీ ప్రభుత్వ హయాంలో అమ్మకాలకు గురయ్యాయి. ఖాయిలా పరిశ్రమల పేరుతో వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేశారు. అలాగే తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ డైరీ కోసం రాష్ట్రంలో పలు సహకార డైరీలకు పొగ పెట్టి నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. ఇక 2014-19 మధ్య ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం సుమారు రూ. 3.60 లక్షల కోట్ల అప్పులు చేసింది. కేంద్రం నిర్దేశించిన పరిమితికి మించి 132.31 శాతం అదనంగా అప్పులు చేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలోనే రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ. 90 వేల కోట్లని కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఈ కొన్ని నెలల వ్యవధిలోనే అప్పు మొత్తం రూ. 7 లక్షల కోట్లకు ఎలా పెరిగిపోయిందో చంద్రబాబే చెప్పాలి.
ఇద్దరి మధ్య అదే తేడా
ఆస్తుల అమ్మకాలు, అప్పుల విషయంలో చంద్రబాబు, జగన్ మధ్య ఎంతో తేడా ఉంది. నాడు చంద్రబాబు ఉత్పాదక సంస్థలైన, వందల, వేల మందికి ఉపాధినిస్తున్న పరిశ్రమలను అమ్మేసి కార్మికులకు ఉద్యోగాల్లేకుండా చేశారు. ఆ పరిశ్రమల ద్వారా రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేశారు. కానీ ప్రస్తుత జగన్ ప్రభుత్వం అనుత్పాదకమైన ప్రభుత్వ స్థలాలను తాకట్టు పెడుతోంది. అలా అప్పు తెచ్చిన నిధులను సంక్షేమ, అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తోంది. ఈ తేడాను గమనిస్తే రాష్ట్రానికి ఎవరు చేటు చేశారో స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవన్నీ విస్మరించి చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై నిందారోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.
Also Read : తప్పు చేయలేదు.. ముందుస్తు బెయిల్ తీసుకోలేదు.. మరి వాళ్లందరూ ఉమా ..?