iDreamPost
android-app
ios-app

TDP Buddha Venkanna – నోటికి పనిచెబితే మేటి నేతలవుతారా?

  • Published Oct 18, 2021 | 2:07 PM Updated Updated Oct 18, 2021 | 2:07 PM
TDP Buddha Venkanna – నోటికి పనిచెబితే మేటి నేతలవుతారా?

ప్రభుత్వాన్ని, వైఎస్సార్‌ సీపీ నాయకులను బదనాం చేసేందుకు నోటికొచ్చినట్టు మాట్లాడేసి, అనుకూల మీడియాలో ప్రచారం పొందడం తెలుగుదేశం నాయకులకు రివాజుగా మారింది. అందులో ముందుండే మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు బొత్తిగా నోటి శుద్ధి లేదు. పొంతన లేని మాటలు మాట్లాడుతూ వింత వింత ఆరోపణలు చేస్తూ పూనకం వచ్చినట్టు ఊగిపోవడమే రాజకీయం అనుకుంటారాయన. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ విజయసాయిరెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఉత్తరాంధ్ర బందిపోటు విజయసాయిరెడ్డని.. చంబల్ లోయలో ఉండాల్సిన ఆయన ఇక్కడ తిరుగుతున్నారని వాగేశారు. విశాఖలో ఫ్యాక్టరీలపై విజయసాయిరెడ్డి ఫైన్‌లు వేస్తున్నారని, 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, విజయసాయిరెడ్డి అక్రమాలపై, అతనికి సహకరించిన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. కొండలు, ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయం..

తాము అధికారంలోకి రాగానే అటు వైఎస్సార్‌ సీపీ నాయకులపై, ఇటు అధికారులపై చర్యలు తప్పవని పదే పదే చెప్పడం ద్వారా టీడీపీ నేతలు బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ మొదలు చోటా మోటా నాయకుల వరకూ ఇదే వరస. అదిగదిగో మేం అధికారంలోకి వచ్చేస్తున్నాం. మీ పని పట్టేస్తాం అంటూ హూంకరిస్తే అధికారులు బెదిరిపోయి, వీరు చెప్పినట్టు వింటారని ఒక భ్రమ. అమావాస్యకో పున్నానికో ఒకసారి మీడియా ముందుకువచ్చి  జనం నమ్ముతారా అన్న సంశయం కూడా లేకుండా పచ్చి అవాస్తవాలు వల్లిస్తున్నారు.

Also Read : Yanamala Rama Krishnudu – పచ్చపాత దృష్టికి శ్వేతపత్రం ఎందుకు?

లోకేశ్‌ పర్యటన కోసమేనా ఈ బిల్డప్..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 20న విశాఖ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు ఈ విధంగా ఓవర్‌ బిల్డిప్‌ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. లోకేశ్‌ రాక సందర్భంగా అనకాపల్లిలో పార్టీ కార్యాలయం ప్రారంభం, సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పర్యటనకు విస్తృత ప్రచారం కల్పించడం కోసం టీడీపీ నాయకులు రంగంలోకి దిగేసి నోటికి పని చెబుతున్నారు. లోకేశ్‌ విశాఖ నుంచే విజయ శంఖారావం పూరిస్తారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రకటించగా, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అయితే లోక్‌శ్‌ టూర్‌ షెడ్యూల్‌తో పాటు, ఉత్తరాంధ్రలో తాము చేపట్టబోయే కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. అంతటితో ఆగకుండా లోకేశ్‌ పర్యటనకు రంగం సిద్ధం చేయడానికన్నట్టు విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న బురద జల్లగా, ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై రాజప్ప ఆవేశపడిపోయారు. ఉత్తరాంధ్రలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని, మాజీ హోంమంత్రి కూడా అయిన రాజప్ప ఎటువంటి ఆధారాలు చూపకుండానే ఆరోపించేశారు. భూములు దోచుకోవడమే పనిగా వైఎస్సార్‌ సీపీ పనిచేస్తోందని విమర్శించారు.

విశాఖ నుంచే విజయశంఖారావమట!

మూడు శాఖలకు మంత్రిగా పనిచేస్తూ మంగళగిరి నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి తలబొప్పి కట్టిన లోకేశ్‌ విశాఖ నుంచి విజయశంఖారావం పూరించడమేమిటో? వారికే అర్థం కావాలి. లోకేశ్‌ నాయకత్వంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పెదవి విరిచిన నేపథ్యంలో నాయకులు, కేడర్‌ ఆయనను పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా లోకేశ్‌ను పార్టీపై రుద్దాలనే వ్యూహంలో భాగంగానే నాయకులు ఈ విధంగా విన్యాసాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమమవుతున్నాయి. లోకేశ్‌ పర్యటనతో పార్టీకి ఏదో కొత్తగా జవసత్వాలు వస్తాయని, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు నాంది పలుకుతూ శంఖం ఊదేస్తారని ఊదరగొట్టేస్తే కేడర్‌ ఆయనకు బ్రహ్మరథం పట్టేస్తారని వీరి ఉద్దేశం. వీరు ఎంత సన్నాహాలు చేసినా లోకేశ్‌ తన వాక్చాతుర్యంతో అందరినీ ఉస్సూరమనిపిస్తారు. అయినా వీరి ఆరాటం, అధికారం పక్షంపై మాటల దాడి ఆగవు. ఎందుకంటే రాజకీయాల్లో ఉనికి కాపాడుకోవడం ముఖ్యం కదా!

Also Read : ABN Fake Audio Peddareddy-ఏబీఎన్ ఆ స్థాయికి పడిపోయిందా, ఎందుకిలా దిగజారుతోంది