Idream media
Idream media
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి (ఎస్సీ రిజర్డ్వ్) పార్టీ ఇంఛార్జిని తెలుగుదేశం నియమించింది. కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలం, మొగుళ్లూరు గ్రామానికి చెందిన గూడూరి ఎరిక్షన్‌బాబును ఇంఛార్జిగా నియమించారు. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇక్కడ ఆ పార్టీ ఇంఛార్జి పోస్టు ఖాళీగా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన బూదాల అజితారావు పార్టీకి దూరంగా ఉండడంతో ఆమె స్థానంలో ఎరిక్షన్‌బాబుకు అవకాశం దక్కింది.
ఆది నుంచి టిడిపితోనే..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎరిక్షన్ బాబు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి నియోజకవర్గ ఇంఛార్జి వరకూ ఎదిగారు. ప్రస్తుతం 2,400 ఓట్లు ఉన్న సొంత గ్రామం మొగుళ్లూరును పార్టీకి పెట్టనికోటగా మార్చారు. మొగుళ్లూరు సర్పంచ్‌గా ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. సొంత మండలం వెలిగండ్ల ఎంపీపీగా, జడ్పీటీసీగా పని చేశారు. బాబు హాయంలో లిడ్ క్యాప్ చైర్మన్‌గా పని చేశారు. కనిగిరి నియోజకవర్గంలో ముక్కు కాశిరెడ్డి, కదిరి బాబూరావు నాయకత్వంలో పని చేశారు. సౌమ్యుడుగా పేరొందిన ఎరిక్షన్ బాబు.. అన్ని పార్టీల నేతలతో సంత్సంబంధాలు కొనసాగించారనే పేరుంది.
Also Read : నారా లోకేష్ మీద కుట్ర జరుగుతుందట …!
యర్రగొండపాలెం నుంచి టీడీపీ తరఫున పాలపర్తి డేవిడ్‌రాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై.. మళ్లీ టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో మళ్లీ వైసీపీ గూటికి చేరారు. ఎన్నికల తర్వాత టీడీపీ తరఫున పోటీ చేసిన అజితారావు పార్టీకి దూరంగా ఉండడంతో ఇంచార్జి పోస్టు ఖాళీ అయింది. ఆ స్థానంలో తిరిగి డేవిడ్‌రాజును నియమించాలనే ప్రతిపాదన పార్టీలోని ఓ వర్గం తెరపైకి తెచ్చింది. అయితే చివరకు ఎరిక్షన్‌బాబుకు అవకాశం దక్కింది.
డేవిడ్‌రాజు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేసిన సమయంలో ఎరిక్షన్ బాబు వెలిగండ్ల జడ్పీటీసీగా ఉన్నారు. డేవిడ్ రాజుకు అనుకూలంగా ఉంటూ జిల్లా పరిషత్‌లో తన హవాను సాగించారు. డేవిడ్ రాజును కాదని ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఎరిక్షన్ బాబు వైపు ఆ పార్టీ అధిష్టానం మొగ్గు చూపడానికి పార్టీ పట్ల విశ్వాసంతో ఉండడమే కారణం.
సురేష్ ను ఢీ కొట్టగలరా..?
ఎరిక్షన్ బాబును ఇంఛార్జిగా నియమించినా.. యర్రగొండపాలెంలో టీడీపీ పరిస్థితిలో పెద్ద మార్పు వస్తుందని చెప్పలేం. వైసీపీ నాయకుడు, మంత్రి ఆదిమూలపు సురేష్‌ను రాజకీయంగా ఎరిక్సన్‌బాబు ఎదుర్కొనగలరా..? అనే సందేహం ఆ పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తోంది. అంగబలం, అర్థబలం, వ్యక్తిగత చరిష్మా ఉన్న ఆదిమూలపు సురేష్‌ను.. కేవలం పార్టీ బలంతో ఎరిక్సన్‌బాబు ఢీ కొనడం కష్టమే. ఆదిమూలపు సురేష్ 2009, 2019లలో యర్రగొండపాలెం నుంచి, 2014లో సంతనూతలపాడు నుంచి గెలిచి హాట్రిక్ సాధించారు. మూడు ఎన్నికలను చూసిన అనుభవం ఉన్న ఆదిమూలపు సురేష్‌కు పోటీగా స్థానికేతరుడైన ఎరిక్సన్‌బాబు ఎంత మాత్రం రాజకీయాలు చేయగలరో చూడాలి.
Also Read : రాజకీయాలకు కిడారి శ్రావణ్ సెలవు!