iDreamPost
iDreamPost
ప్రస్తుతం ఏపీలో నారా చంద్రబాబుడు, తెలుగుదేశం పార్టీ గురించి ఏ టాపిక్ అయినా వైరల్‌గానే మారుతోంది. ఇందుకు అధికార వైఎస్సార్‌సీపీ ఆ పార్టీని టార్గెట్ చేయడమే కారణమని కొందరు అంటున్నారు. ఇందులో నిజానిజాలు దేవుడికే ఎరుక. అయితే ఇటీవలే ఏపీ టీడీపీ అధ్యక్షుడి మార్పు విషయం జోరుగా చర్చలోకొచ్చింది.
ఇప్పటికే 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను చంద్రబాబు ప్రకటించారు. అదే రీతిలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిని కూడా ప్రకటిస్తారని ప్రచారం జోరందుకుంది. కానీ అటువంటి ప్రకటనలేమీ వెలువడలేదు. రాష్ట్ర అధ్యక్షుడి పోస్టుకు శ్రీకాకుళం నుంచి ఆ పార్టీ కీలక నేత కింజారపు అచ్చెన్నాయుడి పేరు లిస్టులో ఫస్టున్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ ప్రకటన రాకపోవడంలో ఆ పార్టీలో అసలేం జరుగుతోందన్న చర్చకు తెరలేచింది.
వాస్తవానికి పార్టీ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు బరువును ఎవరో ఒకరి మీదకు నెడతారని చంద్రబాబు గురించి బాగా తెలిసిన వారు చెప్పే మాట. ఇప్పుడు పార్టీ అదే స్థితిలో ఉంది కాబట్టి ఎవరోకరికి బాధ్యలు అప్పగించి, ఫెయిల్యూర్స్‌ను వాళ్ల మీదకు నెట్టేస్తారన్న భయం పదవి లిస్టులో పేర్లున్నవాళ్ళలో లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే అచ్చెన్న బాధ్యలు స్వీకరించడానికి ముందుకు రావడం లేదని ఒక వాదన ఒక పక్క విన్పిస్తోంది.
ఇంకో వైపు ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న కళావెంకట్రావను నిష్కారణంగా తొలగించొద్దని టీడీపీ యువరాజు లోకేష్ కలుగజేసుకున్నాడని, అందుకే రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రకటన వెలువడలేదని ఇంకో వాదన కూడా విన్పిస్తోంది. అయితే ఇందులో వాస్తవాలేంటన్న సంగతి ఆ పార్టీ నేతలకే తెలియాలి.
అయితే ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షుడు చేయలేనిదేమిటి, కొత్తవారు వస్తే చేయగలిగేదేంటి? అన్న ప్రశ్నలకు ఆ పార్టీ నేతల నుంచి ఖచ్చితమైన సమాధానాలు రావడం లేదు. ఎవరు అధ్యక్ష కిరీటం పెట్టుకున్నప్పటికీ పార్టీలో అధికార మంత్రదండం నారా వారి చేతిలోనే ఉంటుందంటున్నారు. అటువంటప్పుడు ఎవరినెత్తిన పెడితే ఏంటంట అన్న నిట్టూర్పులు వారి నుంచి విన్పిస్తున్నాయి.
రాష్ట్ర అధ్యక్ష పదవిపై క్లారిటీ రావడం మాట అటుంచితే.. ఇప్పటికే ప్రకటించిన పదవులతో ఆ పార్టీ నాయకుల్లో అగ్గిరాజేసినట్టయిందంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, ఎక్కడో మూలనున్న వారిని బైటకు తీసుకువచ్చి పదవులు కట్టబెట్టారని, దీని వల్ల పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారట.
అయితే కొట్లాడి పదవి తెచ్చుకున్నప్పటికీ ఇప్పటికిప్పుడు రాష్ట్రంలోనూ, ఆ మాటకొస్తే ఆయా నియోజకవర్గాల్లోనూ చేయగలిగిందే లేదు కాబట్టి సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న రీతిలో సదరు అసంతృప్త నాయకులు సైలెంట్ మోడల్‌లోకి వెళుతున్నట్టు భోగట్టా. ఏది ఏమైనా పార్టీలో నూతనోత్తేజం నింపుదామని చంద్రబాబు చేసిన ప్రయత్నంలో సరికొత్త తలనొప్పులు ప్రారంభమవ్వడం కాలమహిమగానే చెప్పు కొస్తున్నారు విశ్లేషకులు.