iDreamPost
iDreamPost
తిరుపతి లోక్ సభ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ ముందే సిద్దమయ్యింది. అందరికన్నా ముందుగా తమ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయిన పనబాక లక్ష్మినే మళ్లీ పోటీలో దింపుతున్నట్టు ప్రకటించారు. దాంతో మరోసారి తిరుపతి ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతుందని టీడీపీ ఆశిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ వ్యవహారంలో సందిగ్ధంలో ఉందని ప్రచారం సాగింది. ముఖ్యంగా బీజేపీ ఒత్తిడి చేస్తున్న సమయంలో తమ అభ్యర్థిని ఉపసంహరించుకుని కమలానికి చోటు కల్పిస్తారని బీజేపీ ఆశించింది. కానీ బాబు మాత్రం ముందుగానే తన అభ్యర్థిని ఖాయం చేయడంతో ఈసారి బీజేపీ వ్యూహాలు బెడిసికొట్టినట్టుగానే భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల సన్నాహాల కోసమంటూ చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్‌సభ సీటు పరిధిలో మండలాల వారీగా కమిటీలు, వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌లు, లోక్‌సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్‌చార్జ్‌లుగా ఏడుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు నియామకం చేశారు. తక్షణం కమిటీలు పని ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని వైఎస్సార్సీపీ సునాయాసంగా కైవసం చేసుకుంది. పార్లమెంట్ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా టీడీపీకి దక్కలేదు. దాంతో ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన బల్లి దుర్గాప్రసాద్ కి భారీ మెజార్టీ దక్కింది. 2,28,376 ఓట్ల తేడాతో ఆయన పనబాక లక్ష్మిని ఓడించారు. టీడీపీ అభ్యర్థికి 4.94 లక్షల ఓట్లు మాత్రం దక్కగా మూడో స్థానంలో నోటా, నాలుగో స్థానంలో కాంగ్రెస్ నిలవడం విశేషం. బీజేపీకి ఆరో స్థానం దక్కింది. అయినప్పటికీ ఆపార్టీ నేతలు మాత్రం దుబ్బాక ఫలితాల తర్వాత తామే గెలుస్తామనేటంత స్థాయిలో హంగామా చేశారు. తీరా టీడీపీ తన అభ్యర్థిని రంగంలో దింపడం, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ దాదాపు ఖారారు కావడంతో కమలం ఆశలు దాదాపు నీరుగారినట్టే భావించాలి.
ఇక వైఎస్సార్సీపీ తరుపున దుర్గా ప్రసాద్ తనయుడు బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. దాంతో వైఎస్సార్సీపీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పవచ్చు.