iDreamPost
iDreamPost
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కృష్ణా నదిలోకి కూడా భారీ ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే లక్షలాది క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రం వైపు తరలించినా ఎగువ రాష్ట్రాలలో ఇంకా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి మరింత ఉధృతంగా వరద నీరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పరిణామాలతో ఒక్కసారిగా అప్రమత్తం అయిన తుళ్లూరు అధికారులు కృష్ణా నదిపై అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న ఏపీ విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మరో 36 మందికి తక్షణం సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని తాడేపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరకట్టపై నివాసం ఉండటం సురిక్షితం కాదని, అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ మధ్యన సుమారు 6 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి వచ్చే సంకేతాలు కనిపిస్తుందని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి