iDreamPost
android-app
ios-app

తాడేపల్లిగూడెంలో వైఎస్సార్‌సీపీకి ఎదురే లేదా…!

తాడేపల్లిగూడెంలో వైఎస్సార్‌సీపీకి ఎదురే లేదా…!

పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఏలూరు జిల్లా కేంద్రంగా ఉన్నా నైసర్గికంగా మాత్రం తాడేపల్లిగూడెం జిల్లాకు మధ్యనుంటుంది. దీంతో గతంలో కొందరు నేతలు తాడేపల్లిగూడెంను జిల్లా కేంద్రం చేయాలంటూ డిమాండ్‌ చేసిన దాఖలాలు ఉన్నాయి. కాగా, తాజాగా తాడేపల్లిగూడెంకు చెందిన మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు మరణంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలపై జోరుగా చర్చ జరుగుతోంది.

తాడేపల్లిగూడెంలో టీడీపీ జెండా ఎగిరి రెండు దశాబ్దాలైంది. 1983, 89, 94, 99 ఎన్నికల్లో టీడీపీ గూడెం సీటును కైవసం చేసుకుంది. అయితే యర్రా నారాయణస్వామి(1999) తర్వాత మరెవ్వరూ ఇక్కడ నుంచి టీడపీ తరపున గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు కోసం ముళ్లపూడి బాపిరాజు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, సామాజిక సమీకరణాల లెక్కల్లో టిక్కెట్టు ఈలి నానికి వెళ్లింది. కానీ, ఎన్నికల్లో ఈలి నాని ఓటమి పాలవ్వడం,ప్రస్తుతం ఆయన వైఎస్సార్‌సీపీకి దగ్గరవ్వడంతో తాడేపల్లిగూడెంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఇక బీజేపీ విషయానికొస్తే తాడేపల్లిగూడెంలో పార్టీని క్రియాశీలకంగా నిలపడంలో దివంగత నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు కృషి మరవలేనిది. అయితే విజయావకాశాలు లేని కారణంగానే గూడెం సీటును టీడీపీ బీజేపీకి కేటాయించిందనే వార్తలు అప్పట్లో గుప్పమన్నాయి. కానీ, మోదీ వేవ్, జనసేన–టీడీపీలతో పొత్తు తదితరాలు అన్నీ కలసి రావడంతో 2014లో మాణిక్యాలరావు విజయం సాధించారు. పొత్తుల లెక్కల్లో అనూహ్యంగా మంత్రి పదవిని దగ్గించుకున్నారు. మాణిక్యాలరావు ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు గూడెంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషిచేశారు. ఏలూరులో స్థలసేకరణ కూడా జరిగిన నిట్‌ను తాడేపల్లిగూడెంకు తరలించేందుకు మాణిక్యాలరావు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. తద్వారా నియోజకవర్గంలో సొంత ఇమేజ్‌ను సంపాదించారు. అయితే తాజాగా అలాంటి నేతను కోల్పోవడం బీజేపీకి తీరని లోటని చెప్పొచ్చు. నియోజవర్గంలో మాణిక్యాలరావు తర్వాత సరైన నేత లేకపోవడంతో బీజేపీ కేడర్‌ పూర్తిగా నీరుగారిపోతోంది.

ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో వైఎస్సార్‌సీపీ నుంచి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా, మనిసిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో కొట్టుకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఈలి నాని సైతం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారడం వైఎస్సార్‌సీపీ బలాన్ని రెండింతలు చేసింది. జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌ ఒకింత చురుగ్గా పనిచేస్తున్నారు. కానీ, వైఎస్సార్‌సీపీని ఢోకొట్టే స్థాయి నాయకత్వం లేకపోవడం మిగిలిన పార్టీల బలహీనతగా కనిపిస్తోంది.