iDreamPost
android-app
ios-app

శృతి కలవని స్వరకల్పన – Nostalgia

  • Published Dec 03, 2020 | 12:59 PM Updated Updated Dec 03, 2020 | 12:59 PM
శృతి కలవని స్వరకల్పన – Nostalgia

హీరోల వారసులను అభిమానుల అండతో సెటిల్ చేయడం కొంత సులభమే కానీ నిర్మాతల కొడుకులను స్టార్లను చేయడం అంత సులభం కాదు. రామానాయుడు గారు ఒక్కరే ఈ విషయంలో వెంకటేష్ రూపంలో నూటికి నూరుపాళ్లు విజయం సాధించారు కానీ ఇలాంటి రికార్డు అందరికీ సాధ్యమయ్యేది కాదు. అలా అని ప్రయత్నాలు చేయని వారు లేరని కాదు. వారిలో ఏడిద నాగేశ్వరావుగారు ఒకరు. అది 1989 సంవత్సరం. కమర్షియల్ సూత్రాలకు భిన్నంగా ఉత్తమాభిరుచి కలిగిన సినిమాలు తీస్తారని పూర్ణోదయా బ్యానర్ కు చాలా గొప్ప పేరుంది. శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి చిత్రాలు వాటికి సజీవ సాక్ష్యాలు.

ఆ టైంలో అప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదుగుతున్న తన అబ్బాయి ఏడిద శ్రీరామ్ ని హీరోగా పరిచయం చేయాలని సంకల్పించారు నాగేశ్వర్రావు. తనతో సితార ద్వారా గొప్ప క్లాసిక్ ఇచ్చిన దర్శకుడు వంశీకి ఆ బాధ్యతని అప్పజెప్పారు. అదే స్వరకల్పన. ముత్యమంత ముద్దు, ముద్దుల మావయ్య లాంటి సినిమాలతో హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సీతను హీరోయిన్ గా తీసుకున్నారు. సంగీత దర్శకుడిగా ఇళయరాజాను అనుకున్నప్పటికీ బిజీ షెడ్యూల్స్ వల్ల సాధ్యం కాక ఆయన తమ్ముడు గంగై అమరన్ కు స్వరాలు సమకూర్చే అవకాశాన్ని ఇచ్చారు. ఆరు పాటలు బాగా వచ్చాయి. షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తి చేశారు.

అంతకు నెల క్రితం శివ రిలీజై రాష్ట్రమంతా తాండవం చేస్తున్న టైంలో నవంబర్ 3న స్వరకల్పన విడుదలయ్యింది. కనీస అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని దక్కించుకుంది. ఓ పల్లెటూరిలో పెద్ద మనుషులైన ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య అపార్థం వల్ల ఏర్పడిన దూరాన్ని దంపతులైన హీరో హీరోయిన్లు పరిష్కరించడమే ఇందులో కథ. హీరో పాత్రకు దివంగత ఎస్పి బాలసుబ్రమణ్యం డబ్బింగ్ చెప్పడం విశేషం. రీ రికార్డింగ్ టైంలో సమ్మె జరుగుతుండటంతో వంశీ తెలివిగా ఇళయరాజా ఇదే సంస్థ కోసం చేసిన సినిమాల్లోని బిజిఎం వాడుకున్నాడు. అదే ఇద్దరి మధ్య దూరానికి మొదటి కారణం అయ్యింది. ఫ్లాపయినా స్వరకల్పన రష్యన్ భాషలో డబ్బింగ్ కావడం విశేషం.