మదనపల్లె హత్యల తర్వాత అందరూ ఏదో షాక్ తిన్నట్టు Act చేస్తున్నారు. కానీ , మనం ఇంత కాలం బతికింది మూర్ఖత్వం, అజ్ఞానం మధ్యనే కదా! సైన్స్‌తో పాటు మూఢ నమ్మకాలు సమాంతరంగా పెరుగుతున్నాయి. టీవీల్లో రోజుకో స్వామి, ప్రవచనకారుడు నానా రకాల టిప్స్ చెబుతున్నారు. వీళ్లు చాలదని వాస్తు పండితులు, న్యూమరాలజిస్టులు ఉతికి ఆరేస్తున్నారు. ఒకడు తాయత్తు అంటాడు, ఇంకొకడు జేబులో విగ్రహం పెట్టుకోమంటాడు. ఇది ఒక మతంలో కాదు, అన్ని మతాల్లో ఉన్నాయి.
మా చిన్నతనంలో అయితే మరీ అన్యాయం. జ్వరం వస్తే దిష్టి తీసేవాళ్లు. తాయత్తులు కట్టేవాళ్లు. గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లేవాళ్లు తక్కువ. అక్కడ ఎర్రరంగు టానిక్ ఇచ్చేవాళ్లు. తగ్గితే మన అదృష్టం. ప్రైవేట్ డాక్టర్లు ఒకరిద్దరు వుండేవాళ్లు కానీ, మామూలు జనం దగ్గర రెండుమూడు రూపాయలు కూడా లేని కాలం. ఇది కాకుండా రాయదుర్గంలో చిత్రవిచిత్రమైన అజ్ఞానం ఉండేది. గిట్టని వాళ్లకి మందు పెడతారని నమ్మకం. ఎవరైనా కృశించిపోతుంటే వాడికి మందు పెట్టారని అనేవాళ్లు. కర్నాటక గ్రామాల్లో ఇప్పటికీ ఈ నమ్మకం ఉంది. విచిత్రం ఏమంటే బెంగళూరు సిటీలో కూడా ఈ మందు కక్కించే మంత్రగాళ్లు ఉన్నారు. మనం వెళ్లి డబ్బులిస్తే (ఫీజు ఆ రోజుల్లోనే రూ.50 ఉండేది) పసురులాంటిది తాగిస్తాడు. కాసేపటికి వాంతి అవుతుంది. ముద్దలాంటి వుండని చూపించి ఇదే మందు అంటాడు. కొంత మంది రోగులకి మనోవ్యాధి పోయి కోలుకునే వాళ్లు. కొంత మంది ఇంకా కృశించి చనిపోయే వాళ్లు (అసలు వ్యాధి వేరే కాబట్టి).
అమ్మవారు (పొంగు) వస్తే పిల్లలకి చికిత్స వుండేది కాదు. వేప ఆకులతో కొట్టేవాళ్లు. నరకం చూపించేవాళ్లు. కొంత మంది చనిపోయేవాళ్లు. పూనకం వెరీ కామన్. మా స్కూల్‌లో రాజు అనే వాడికి ఆంజనేయస్వామి వచ్చేవాడు. వాడి జోలికి ఎవరూ వెళ్లేవారు కాదు. గ్రామ దేవతల జాతరల్లో వందల మంది ఆడవాళ్లు పూనకాలతో వూగేవాళ్లు.
ప్రతి శనివారం ఆంజనేయస్వామి గుడి వద్ద దెయ్యాలు పట్టిన ఆడవాళ్లను తీసుకొచ్చేవాళ్లు. జుత్తు విరబోసుకుని వాళ్లు ఆంజనేయస్వామిని సవాల్ చేస్తూ అరిచేవాళ్లు. నిజంగా వాళ్లలో దెయ్యం ఉందని నమ్మేవాన్ని.
మా పెద్దమ్మకి ఒకసారి దెయ్యం పట్టింది. ఇంట్లో విపరీతమైన పని, నలుగురు పిల్లలు, మూడు ఎనుములు, సోమరిగా తిరిగే భర్త. దెయ్యం పట్టక ఏమవుతుంది? దెయ్యాలకు కూడా మతం ఉంటుంది. ఆమెకి పట్టింది ముస్లిం దెయ్యం. ఉర్దూ మాట్లాడేదట, ఆ వూళ్లో ఒక్కడికీ ఉర్దూరాదు. కానీ ఆమె ఉర్దూ మాట్లాడుతోందని కనిపెట్టారు.
రాయదుర్గం సిద్దుల కొండ కింద ఒక ముస్లిం ఉండేవాడు. ఆయన ఏదో ఉద్యోగం చేస్తూ పనిలో పనిగా పార్ట్‌టైమ్ అంజనం వేసేవాడు. ఐదు రూపాయల ఫీజు. పల్లెల్లో, బావుల్లో మోటార్లు దొంగతనాలు జరిగేవి. ఇది కాకుండా చిన్నచిన్న దొంగతనాలకి దొంగల్ని కనిపెట్టడానికి అంజనం కోసం వచ్చేవాళ్లు. నేను కూడా ఈ అంజనం దగ్గరికి రెండుసార్లు వెళ్లాను.
ఒకసారి మా ఫ్రెండ్ ఊళ్లో బావిలో మోటార్ పోయింది. అంజనం వేయించారు. ఒక కాగితం మీద నల్లటి కాటుక లాంటిదాన్ని పూసి దాన్ని అలాగే చూడమంటాడు. పెద్దవాళ్లకి ఇది కనపడదు. చిన్న పిల్లలే చూడాలి. మా ఫ్రెండ్ చూశాడు. ఆ కాటుకలో ఏవో నీడలు కనపడితే ఏవేవో ఊహించుకుని ఆల్రెడీ మనసులో ఎవరి మీద అనుమానం ఉందో వాళ్లని దొంగలుగా నిర్ధారిస్తారు, ఈ అంజనం వల్ల ఆ ఊళ్లో అందరూ కొట్టుకుచచ్చారు.
రెండోసారి వాచీ దొంగతనం. అంజనం చూసే కుర్రాన్ని ప్రశ్నలడుగుతూ ఉంటాడు. ఎవరొచ్చారు? అతను నీకు తెలుసా? అని అడుగుతూ ఉంటే, వాడు ఆ నీడల్లో ఎవరినో ఊహించుకుంటాడు. ఒక్కోసారి వర్కవుట్ అవుతుంది. చాలాసార్లు కొత్త గొడవలు వస్తాయి.
ఆంధ్రజ్యోతి 2000వ సంవత్సరంలో మూసేస్తే, వేరే ఏ పనీ రాక అప్పులపాలు కావడానికి శంఖారావం అని తిరుపతిలో ఒక వారపత్రిక పెట్టాను. అప్పుడు ఒక స్వామీజీ శిష్య బృందంతో పరిచయమైంది. వాళ్ల వల్ల పత్రికకు నాలుగు చందాలు వస్తాయని నా ఆశ. నా వల్ల స్వామీజీ భక్తులు పెరుగుతారని వాళ్ల ఆశ. ఒకసారి వాళ్ల పూజకు వెళ్లాను. పది నిమిషాలు ఏవో భక్తి గీతాలు పాడి , తర్వాత మ్యూజిక్ పెంచి పీర్ల పండుగలో ఎగిరినట్టు ఎగిరారు. జడుసుకుని వచ్చేశాను.
రెగ్యులర్‌గా పూజకు వస్తే నా పత్రిక ఆంధ్రప్రదేశ్‌లో నెంబర్ ఒన్ అవుతుందని చెప్పారు. తిరుపతిలో శబ్దం లేకుండా నేను ఊదిన శంఖారావం కెపాసిటీ నాకు తెలుసుకు కాబట్టి నమ్మలేదు.
వాళ్ల వల్ల చందాలు రాకపోగా, పిచ్చి గ్యారెంటీ వస్తుందని అర్థం కావడంతో వాళ్ల జోలికి వెళ్లలేదు. శంఖారావం అప్పుల్ని ఐదేళ్లు తీర్చాను. అక్షరం రాయడం వేరు, అమ్మడం వేరు.
భక్తి, నమ్మకం, విశ్వాసం ఒక హద్దులో ఉంటే ఫర్వాలేదు. విషాదం ఏమంటే మనుషుల్లో అన్నీ ముదిరిపోతున్నాయి.
కనిపించే మనుషుల పట్ల అపనమ్మకం, అవిశ్వాసం
కనపడని వాటిపై నమ్మకం, విశ్వాసం.