కేవలం కాంబినేషన్లతో వచ్చే క్రేజ్ వల్ల సినిమాలు ఆడవు. కంటెంట్ చాలా ముఖ్యం. స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం లెక్క తప్పినా బాక్సాఫీస్ వద్ద దెబ్బ తినడం ఖాయం. ఈ సూత్రం స్టార్ హీరోకైనా చిన్న తారకైనా వర్తిస్తుంది. ఓ ఉదాహరణ చూద్దాం. 1994వ సంవత్సరం. వెంకటేష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. క్షణక్షణం, చంటి, సుందరకాండ, చినరాయుడు, కొండపల్లి రాజా, అబ్బాయి గారు ఇలా అన్నీ సూపర్ హిట్లే. కమర్షియల్ గా భారీ లాభాలు తెచ్చినవి. ఆ టైంలో వెంకటేష్ ని ఒక ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తే ఎలా ఉంటుందన్న సురేష్ బాబు ఆలోచనకు గుహనాథన్ ఒక కథా రూపాన్ని తీసుకొచ్చారు. అదే సూపర్ పోలీస్.
ప్రియురాలు చనిపోవడం వల్ల ఒళ్ళంతా నిర్లక్ష్యం నిండిన ఒక జాలీ పోలీస్ ఆఫీసర్ జీవితంలో వచ్చిన అనూహ్య మార్పులు, అతని గతంలో రేగిన విషాదంలో విలన్ల పాత్ర ఉందని తెలుసుకున్న తర్వాత తీసుకొచ్చే మార్పులు ఆధారంగా సూపర్ పోలీస్ రూపొందింది. సురేష్ బ్యానర్ లో మంచి సినిమాలు చేసిన కె మురళీమోహన్ రావు గారిని దర్శకుడిగా ఫిక్స్ చేశారు. అప్పటికాయన వెంకటేష్ తో బ్రహ్మరుద్రులు, త్రిమూర్తులు చేశారు కానీ అవి ఫ్లాప్ అయ్యాయి. హిందీలో టేకప్ చేసిన చంటి రీమేక్ ఆనారి సక్సెస్ అయ్యింది. ఇది నాలుగో సినిమా. అయితే స్ట్రెయిట్ సబ్జెక్టుతో వెంకీతో గట్టి హిట్టు కొట్టాలని మాటల రచయిత ఎంవిఎస్ హరనాథరావుతో ఫైనల్ వెర్షన్ రెడీ చేయించారు.
రోజా, జెంటిల్ మెన్ తో ఏఆర్ రెహమాన్ పేరు అప్పటికే మారుమ్రోగిపోతోంది. చాలా డిమాండ్ తో పాటు బాగా బిజీగా ఉన్నప్పటికీ సురేష్ బాబు పట్టుబట్టి ఒప్పించి రెమ్యునరేషన్ లెక్కచేయకుండా మరీ సూపర్ పోలీస్ కి మ్యూజిక్ ఇప్పించారు. టాలీవుడ్ లో రెహమాన్ పాటలు ఇచ్చిన మొదటి సినిమా ఇదే. ఏవేవో కారణాల వల్ల షూటింగ్ చాలా ఆలస్యమయ్యింది. కోట శ్రీనివాసరావు అద్భుతమైన విలనీ, నగ్మా గ్లామర్, జయసుధ కీలకపాత్ర, సౌందర్య ఫ్లాష్ బ్యాక్ క్యామియో, భారీ బడ్జెట్ ఇవేవి 1994 జూన్ 23న విడుదలై వీక్ కంటెంట్ ఉన్న సూపర్ పోలీస్ ని కాపాడలేకపోయాయి. కథ కంటే అదనపు హంగులు ఎక్కువైపోవడంతో ఫలితం నిరాశపరిచింది. ఇందులో బాబు లవ్ చేయరా ట్యూన్ రెహమాన్ మళ్ళీ రంగీలాలో వాడుకుని దేశమంతా మారుమ్రోగిపోయేలా చేయడం కొసమెరుపు.