iDreamPost
android-app
ios-app

లెక్క తప్పిన కామెడీ హీరోస్ – Nostalgia

  • Published Jan 21, 2021 | 9:42 AM Updated Updated Jan 21, 2021 | 9:42 AM
లెక్క తప్పిన కామెడీ హీరోస్ – Nostalgia

హాస్య నటులను హీరోలుగా సినిమాలు తీయడం కొత్తేమి కాదు కానీ సదరు దర్శకులు కథలను ఎంచుకునే విషయంలో చేసే పొరపాట్లు ఒక్కోసారి భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయి. నటన దర్శకత్వం అనే రెండు పడవల ప్రయాణం చేయడం ఎప్పుడూ సవాలే. ఏ మాత్రం తేడా కొట్టినా కిందపడి పోవడం ఖాయం. దానికి ఉదాహరణ ఏవిఎస్ తీసిన సూపర్ హీరోస్ సినిమా గురించి చెప్పొచ్చు. 1997 సంవత్సరం తాత మనవడు షూటింగ్ జరుగుతుండగా ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి రామానాయుడిని ఏవిఎస్ లోని రచనా దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా రికమండ్ చేశారు బ్రహ్మానందం. ఒకటికి పదిసార్లు కథ వింటే కానీ ఓకే చేయని అలవాటున్న నాయుడు గారు అంతగా బ్రమ్మీ చెబుతుండటంతో ఎస్ అనేశారు.

అప్పటికి ఏవిఎస్ కి దర్శకత్వ అనుభవం లేదు. ఎవరి దగ్గరా నేర్చుకోనూ లేదు. ఉన్నదల్లా తన మీద నమ్మకం అంతే. టాలెంట్ ని చాలా నేర్పుగా గుర్తించే అలవాటున్న ఏవిఎస్ సంగీత దర్శకుడిగా మణిశర్మను పరిచయం చేయాలని నిర్ణయించుకోవడంతోనే తన ముందు చూపుని ప్రదర్శించారు. కామెడీ చిత్రాలకు అద్భుతమైన మాటలు రాస్తారని పేరున్న దివాకర్ బాబుని డైలాగుల కోసం తీసుకున్నారు. శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణం అందించారు. తనతో పాటు బ్రహ్మానందంని హీరోగా పెట్టుకుని ఫాంటసీని మిస్క్ చేసి ఏవిఎస్ రాసుకున్న కథను చెప్పుకోదగ్గ పెద్ద బడ్జెట్ లోనే తీశారు రామానాయుడు గారు.

1997 మే 29న సూపర్ హీరోస్ విడుదలయ్యింది. ఎన్నో అంచనాలతో థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు తీవ్ర నిరాశ కలిగిస్తూ ఏవిఎస్ వండిన నవ్వుల వంటకంలో ఉప్పు కారం ఎక్కువయ్యాయి. తల్లి సెంటిమెంట్ ని అతిగా జొప్పించడంతో పాటు దెయ్యాల రాజుగా ఇరికించిన సత్యనారాయణ ట్రాక్ బాగా తేడా కొట్టేసింది. దానికి తోడు ఎన్నడూ లేనిది ఏవిఎస్, బ్రహ్మానందం ఈ ఒక్క సినిమాలోనే కొంచెం ఓవర్ చేశారనిపిస్తుంది. ఫలితంగా డిజాస్టర్ తప్పలేదు. ఇందులో అచ్చతెలుగు బాషరా అమ్మంటే అనే పాటను ఏవిఎస్ స్వయంగా రాశారు. దీంతో డెబ్యూ చేసిన మణిశర్మ గొప్ప స్థాయికి చేరుకోవడం ఒక్కటే సూపర్ హీరోస్ విషయంలో జరిగిన మంచి పని.