iDreamPost
iDreamPost
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని ఇంకో లాంగ్వేజ్ లో రీమేక్ చేసుకోవడం సర్వసాధారణం. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. కానీ ఒక కథ డబ్బింగ్ వెర్షన్ సూపర్ హిట్ అయ్యాక కూడా మళ్ళీ కొంత గ్యాప్ లో రీమేక్ చేయడం అంటే విశేషమేగా. తెలిసిన స్టోరీనే మళ్ళీ ప్రేక్షకులు తెరమీద చూసి ఆదరిస్తారని దర్శక నిర్మాతలు ఎంత గట్టిగా నమ్మితే ఇలా చేస్తారు. ఓ ఉదాహరణ చూద్దాం. 1990లో కార్తీక్ హీరోగా తమిళ్ లో ‘కిజక్కు వాసల్’ వచ్చింది. రేవతి, ఖుష్భూ హీరోయిన్లు. స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో ముక్కోణపు ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్. సిల్వర్ జూబ్లీ చేసుకుని క్లాసిక్ గా నిలిచింది. ముఖ్యంగా ఇళయరాజా పాటలు నేపధ్య సంగీతం కొంత కాలం పాటు ఆడియన్స్ ని వెంటాడాయి.
దీన్ని కొంత గ్యాప్ తర్వాత తెలుగులో ‘తూర్పు సింధూరం’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇక్కడా బాగానే ఆడింది. అనువాదమే అయినప్పటికీ నిర్మాతలు తీసుకున్న శ్రద్ధ వల్ల మంచి క్వాలిటీతో ఒరిజినల్ అనే ఫీలింగ్ కలిగేలా నేటివిటీ ఉండటంతో మనవాళ్ళు ఆదరించారు. కొన్ని సెంటర్లలో షిఫ్టింగ్ మీద హండ్రెడ్ డేస్ ఆడింది. మ్యూజిక్ కు మాత్రం అదే స్పందన దక్కింది. పచ్చా పచ్చని కల, పొద్దువాలిపోయే పాటలు రేడియోలు, ఆడియోలో హోరెత్తిపోయాయి. దర్శకుడు ఆర్వి ఉదయ్ కుమార్ టేకింగ్ కి తమిళనాడులో పలు రాష్ట్ర అవార్డులు కూడా దక్కాయి. మణిరత్నం అంజలి అదే రోజు పోటీగా వచ్చినా రెండూ ఘన విజయం సాధించాయి.
కట్ చేస్తే 1995లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో జగపతిబాబు, మీనా, సౌందర్య ప్రధాన పాత్రల్లో పైన చెప్పిన తూర్పు సింధూరాన్ని కొద్దిపాటి చిన్న మార్పులతో ‘చిలకపచ్చ కాపురం’గా మళ్ళీ రీమేక్ చేశారు. అప్పుడు ఇద్దరు హీరోయిన్ల ట్రెండ్ ఉధృతంగా నడుస్తోంది. సంగీతం విద్యాసాగర్ అందించగా ఆకెళ్ళ సంభాషణలు సమకూర్చారు. చరణ్ రాజ్, గిరిబాబు, క్యాస్టూమ్స్ కృష్ణ, అన్నపూర్ణ తదితరులు ఇతర తారాగణం. కమర్షియల్ గా చిలకపచ్చ కాపురం పర్వాలేదు అనిపించుకుంది కానీ తూర్పు సింధూరం రేంజ్ లో అద్భుతాలు చేయలేదు. దీని దర్శకులు ఆర్వి ఉదయ్ కుమార్ తెలుగులో ఆ తర్వాత శ్రీకాంత్ తో తారకరాముడు స్ట్రెయిట్ మూవీ చేశారు అదీ యావరేజ్ గానే నిలిచింది. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి మరోసారి వాటిని ప్రస్తావించుకుందాం.