iDreamPost
android-app
ios-app

కష్టాల్లో ఉన్న ఉపాధ్యాయునికి”గురుదక్షిణ” ఇచ్చిన విద్యార్థులు…

కష్టాల్లో ఉన్న ఉపాధ్యాయునికి”గురుదక్షిణ” ఇచ్చిన విద్యార్థులు…

కరోనా కారణంగా దేశంలో అనేకమంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేకమందికి ఉపాధి దొరకడం లేదు. దీంతో పలువురు కడు దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు.. విద్యాసంస్థలు మూతపడటంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది.. కుటుంబ పోషణ నిమిత్తం ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకుంటున్నారు.

తాజాగా ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ కోసం ఆయన పడుతున్న కష్టాలను చూడలేక ఆయన దగ్గర విద్యను అభ్యసించిన విద్యార్థులు గురువుకు ఉపాధి కల్పించడానికి నడుం బిగించారు.

వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన‌ 52 ఏళ్ల ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయుడు హ‌నుమంతుల రఘు కరోనా కారణంగా కుటుంబ పోషణ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రైవేట్ స్కూల్ మూతపడటంతో ఉపాధ్యాయ వృత్తిని కోల్పోవడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన దగ్గర విద్యను నేర్చుకున్న పూర్వపు విద్యార్థులు ఆయనకు ఎలాగైనా సాయం చేయాలని నిర్ణయించుకుని ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకునేల షెడ్డును నిర్మించి ఆయనకు “గురుదక్షిణ” సమర్పించారు. అంతేకాదు ఆ టిఫిన్ సెంటర్ కు కస్టమర్లను తీసుకొచ్చే బాధ్యత కూడా తమదే అని ప్రకటించారు.

1997-98 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు తనకు ఇచ్చిన గురుదక్షిణ చూసి టీచర్ రఘు ఆనందం వ్యక్తం చేశారు. తన విద్యార్థులకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదని వెల్లడించారు. విద్యార్థులు తనపై ప్రేమతో ఇచ్చిన ఆ టిఫిన్ సెంటర్ కు “గురు దక్షిణ” అని నామకరణం చేశారు. ఆదివారం నుండి ఈ టిఫిన్ సెంటర్ ప్రారంభం కాబోతుంది.