iDreamPost
android-app
ios-app

OTT కథ మళ్ళీ మొదటికి

  • Published May 26, 2020 | 5:43 AM Updated Updated May 26, 2020 | 5:43 AM
OTT కథ మళ్ళీ మొదటికి

లాక్ డౌన్ వల్ల మూతబడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో ఇతర బాషా నిర్మాతలు ఓటిటి రిలీజ్ కు మొగ్గు చూపుతున్న వేళ తెలుగులో ఆ దిశగా అడుగులు వేగంగా పడటం లేదు. వేచి చూద్దాం అనే ధోరణి ఒకవైపు అవలంబిస్తున్నా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలియని అనిష్చితిలో నిర్మాతలు తీవ్ర ఒత్తిడిని అనుభవిస్తున్నారు. మరోవైపు షూటింగ్ పూర్తయిన చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్న ఉప్పెన లాంటి సినిమాలు త్వరలోనే ఫస్ట్ కాపీని సిద్ధం చేసుకుంటాయి.

ఇలా విడుదల కాబోయే సినిమాల సంఖ్య అంతకంతా పెరుగుతూ పోతుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ దాకా వేచి చూద్దాం అనుకున్న ప్రొడ్యూసర్లు ఒకవేళ అప్పుడు విపరీతమైన పోటీ ఏర్పడి కలెక్షన్లు పంచుకోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇంతా చేసి హిట్ టాక్ రాకపోతే ఆటోమేటిక్ గా డిజిటల్ హక్కుల డిమాండ్ తగ్గిపోతుంది. రేట్ కూడా ఆశించినంత రాదు. స్టార్లు ఉన్న సినిమాలకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడు రిలీజ్ చేసినా ఒకటే. అప్పుడెప్పుడో అంజి ఆరేళ్ళ తర్వాత విడుదల చేస్తే ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. అమ్మోరు మీద సైతం ఆలస్యం అనే ప్రభావం ఏ మాత్రం లేకపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒకవైపు పైరసీ, మరోవైపు జనం హాళ్లకు మునుపటి లాగా వస్తారో లేదో అన్న టెన్షన్.

దీంతో మొన్నటి దాకా అనుష్క నిశబ్దం, నాని విలు డిజిటల్ ద్వారా రావొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు మాత్రం అంతా గప్ చుప్. జూన్ మొదటివారం తర్వాత దీనికి సంబంధించి కీలకమైన ప్రకటనలు ఉంటాయని కొందరు చెబుతున్న మాట. ఏదేమైనా టాలీవుడ్ వరకు ఓటిటి కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మొన్నే కోన వెంకట్ నిశ్శబ్దం గురించి చెబుతూ థియేటరే మా ప్రాధాన్యం అని చెబుతూనే మళ్ళీ ఇంకో ట్వీట్ లో లేట్ అయితే ఓటిటి అనే హింట్ ఇచ్చారు. ఇలాంటి అయోమయమే అందరిలోనూ ఉంది.మరోవైపు హిందీ, తమిళ్ తో పాటు మలయాళం, కన్నడలోనూ డైరెక్ట్ డిజిటల్ రీలీజ్ కు సిద్ధమవుతున్న కౌంట్ మెల్లగా పెరుగుతోంది. మరి మనవైపు ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేసి చూడాలి మరి