iDreamPost
iDreamPost
వచ్చే ఏడాది సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసుకున్న రాజమౌళి క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ వాయిదా తప్పకపోవచ్చనే టాకే ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది. లాక్ డౌన్ వల్ల ఐదు నెలలుగా షూటింగులు లేకపోవడంతో పాటు వైరస్ ఎంతకీ కంట్రోల్ కాకపోవడంతో ప్లాన్ చేసుకున్న ట్రయిల్ షూట్ ని కూడా జక్కన్న వాయిదా వేసుకున్నాడు. అసలు ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ పూర్తి చేయగలరా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కెమెరా మెన్ సెంథిల్ కుమార్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా 70 శాతం పైగా పూర్తయ్యిందని చెప్పడం చూస్తే ఆశలు పూర్తిగా సన్నగిల్లలేదనే చెప్పాలి.
ఒకవేళ సెప్టెంబర్ కంతా కేసులు తగ్గుముఖం పడితే అప్పుడు కంటిన్యూ చేయొచ్చు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఎలాగూ వేరే కమిట్ మెంట్స్ ఏమీ లేవు. అంతా సద్దుమణిగితే మేకప్ వేసుకుని రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వైరస్ దాదాపు జీరో స్థితికి వస్తేనే ఇది సాధ్యం. మిగిలింది పాతిక శాతమే కాబట్టి రెండు నెలల్లో పూర్తి చేస్తే కనక పోస్ట్ ప్రొడక్షన్ కు ఇంకో నెల టైం ఉంటుంది. షూట్ చేసిన భాగానికి ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సమాంతరంగా అయ్యిందని సెంథిల్ కుమారే చెప్పారు కాబట్టి బాలన్స్ పార్ట్ కు మాత్రమే నిర్మాణాంతర కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఇక్కడ మరో చిక్కు ఉంది. హీరోయిన్లు అలియా భట్, ఒలీవియా మారిస్ డేట్లు వెంటనే దొరకాలి. అలియాకు బాలీవుడ్ లోనూ షూటింగులు ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మాస్త్ర చాలా కీలకం.
అమితాబ్ తో పాటు పలువురు ప్రముఖులకు కరోనా పాజిటివ్ రావడంతో సెట్ కు వెళ్లడం గురించి స్టార్లందరూ భయపడుతున్నారు. ఒకవేళ ముంబైలో అనుకూలంగా లేదు అనుకుంటే అలియా హైదరాబాద్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎటొచ్చి విదేశాల్లో ఉన్న ఒలీవియా మారిస్ ని రప్పించడమే పెద్ద టాస్క్. అందుకే రాజమౌళి విడుదల తేదీ ఫిక్స్ కావడం గురించి లేదా వాయిదా గురించి ఏదీ మాట్లాడ్డం లేదు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఆర్ఆర్ఆర్ కు సాయి మాధవ్ బుర్ర సంభాషణలు సమకూర్చారు. అజయ్ దేవగన్, సముతిరఖని, శ్రేయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఆర్ఆర్ఆర్ 300 కోట్లకు పైగా పెట్టుబడితో రూపొందుతోంది. తాజాగా వచ్చిన నిబంధనల వల్ల శానిటైజేషన్ తదితర ఏర్పాట్ల కోసం అదనంగా మరికొన్ని కోట్లు ఖర్చు పెట్టక తప్పేలా లేదు. యూనిట్ సభ్యులు ఎంత ఎక్కువగా ఉంటే రిస్క్ బడ్జెట్ పెరుగుతుంది. సో ఇంకో నెలకు పైగానే దీనికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ రాకపోవచ్చు.