పొరుగు దేశం శ్రీలంకలో నేడు శనివారం అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కొత్త అధ్యక్షుడిని 1.59 కోట్ల మంది ఓటర్లు ఎన్నుకోనున్నారు. శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్ పార్టీ తరఫున మాజీ డిఫెన్స్ సెక్రటరీ గొటబాయా రాజపక్స (70), అధికార పార్టీ అభ్యర్థి సాజిత్ ప్రేమదాస (52), నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) పార్టీ అభ్యర్థి అనుర కుమారా దిస్సనాయకేలు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు.
2015లో ఎన్నికైన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అభ్యర్థుల్లో అధికార పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ అభ్యర్థి ప్రేమదాసకు ‘సామాన్య మనిషి’గా పేరుంది. 1989–93 మధ్య అధ్యక్షుడిగా పనిచేసిన రణసింఘే కొడుకు ప్రేమదాస కావడం ఈయనకున్న బలం. 1993లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు ఆయన్ను హతమార్చారు. తండ్రి వారసత్వం కలసి వస్తుందని సాజిత్ భావిస్తున్నారు.