iDreamPost
iDreamPost
గత కొంత కాలంగా వరస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ కొత్త సినిమా శ్రీకారం మార్చి 11 విడుదలకు సిద్ధమవుతోంది. ఆ మధ్య వస్తానంటివో పోతానంటివో వగలు పలుకుతావే పాట బాగా వైరల్ కావడంతో దీని మీద సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేగింది. నాని గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన శ్రీకారం ద్వారా కిషోర్ రెడ్డి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. లాక్ డౌన్ కు ముందే కీలక భాగం పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం ఇంతకాలం ఆగాల్సి వచ్చింది. ఇందాకే టీజర్ ని ఆన్ లైన్ వేదికగా మహేష్ బాబు ద్వారా విడుదల చేశారు.
ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు తమ పిల్లల్ని వాళ్ళ వృత్తిలోనే చూడాలనుకుంటున్నారు. కానీ ఒక్క రైతు విషయంలోనే ఆలా జరగడం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే రైతు పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ఈ పరిస్థితుల్లో మార్పు కోసం నడుం బిగిస్తాడు ఓ యువకుడు(శర్వానంద్). సౌకర్యాలు సుఖాల కోసం ఉన్నత ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా పంచె కట్టుకుని పొలాల్లో దిగుతాడు. తనే కాదు అందరికీ ఒకతాటి మీదకు తీసుకొస్తాడు. అయితే ఇతను అనుకున్న ప్రయాణం సాఫీగా సాగిందా, కార్పొరేట్ శక్తులు ఏమైనా లక్ష్యంగా చేసుకున్నాయా లాంటివి సినిమాలోనే చూడాలి
స్వచ్ఛమైన పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామాలో శర్వానంద్ కొత్తగా కనిపిస్తున్నాడు. విజువల్స్ ఆహ్లదకరంగా ఉన్నాయి. యువరాజ్ ఛాయాగ్రహణం గ్రామీణ అందాలను చక్కగా బంధించింది. మిక్కీ జె మేయర్ సంగీతం సబ్జెక్టుకు తగట్టు సాగినట్టు అనిపిస్తోంది. మహర్షి తర్వాత ఆ స్థాయిలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఇంకే మూవీ రాలేదు. అందులో కన్నా శ్రీకారంలో సహజత్వానికి పెద్ద పీఠ వేశారు. నరేష్, మురళి శర్మ, సాయికుమార్, ఆమని, సప్తగిరి, సత్య, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్ పై నిర్మించిన శ్రీకారం శివరాత్రి కనుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు
Teaser Link @ https://bit.ly/3a0u89N