Idream media
Idream media
ప్రత్యేక హోదా.. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంజీవని వంటిది. విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా డిమాండ్ ఏడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. మొదట్లో అదిగో, ఇదిగో అంటూ వచ్చిన కేంద్రం తాజాగా దానిపై పెదవి విరుస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న విషయం మరోసారి పార్లమెంట్ వేదికగా తేటతెల్లం అయింది. ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని కేంద్రం కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేసింది.
14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా వీలుకాదని తెలిపింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల చెప్పారు. కేంద్ర ప్రకటనపై వైసీపీ ఎంపీలు భగ్గుమంటున్నారు. ప్రత్యేక హోదా హక్కును వదిలేదని లోక్ సభలో పోరాడుతున్నారు. నేడు కేంద్రం నిర్లక్ష్యంగా సమధానం చెప్పడానికి నాడు చంద్రబాబు చేసిన తప్పిదాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొదటికి, ఇప్పటికి ఎంత మార్పు
2013 మార్చిలో అప్పటి కేంద్ర క్యాబినెట్ మన్మోహన్ సింగ్ అద్యక్షతన సమావేశమై ప్రత్యేక హోదా హామీని ఆమలు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు మినిట్స్ కూడా నమోదు చేసింది. దానికి తగ్గట్లే బీజేపీ సైతం తమ ఎన్నికల హామీగా ప్రచార సభల్లో ప్రత్యేక హోదాన్ని ప్రస్తావించారు. విభజనతో అన్ని విధాలుగానూ నష్టపోయిన ఏపీని ఆదుకుంటామని ముసలి కన్నీరు కార్చింది. ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తామిచ్చిన హామీని నెరవేర్చే విషయంలో అడ్డగోలు వాదనలు వినిపిస్తోంది.
రెండోసారి కూడా బీజేపీనే గద్దెనెక్కింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఏడేళ్లు గడిచిపోయాయి. మొదటి సారి ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాపై బీజేపీ చెప్పిన అభిప్రాయం రెండోసారి ఎన్నికలు వచ్చేసరికి మారిపోయింది. ఇప్పుడు ఇచ్చేది లేదని స్పష్టంగా చెబుతోంది. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ నిబద్ధత, రాజ్యాంగ బద్దత లేకపోవడం, ఏపీ ని ఆదుకోవాలనే బాధ్యత కొరవడడమే ఇందుకు కారణమని తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు తీరే ఏపీకి శాపం…
రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2014 జూన్ 8న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై గట్టిగానే ప్రగల్బాలు పలికారు. ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి అని, అది సాధించడం టీడీపీతోనే సాధ్యమని ప్రచారంలో ఓ రేంజ్ లో స్పీచ్ లిచ్చారు. అలాంటి ఎన్నో కల్లబొల్లి కబుర్లతో గద్దెనెక్కారు.
అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొదటి ఏడాది ప్రత్యేక హోదాపై కట్టుబడి ఉన్న బాబులో ఆ తర్వాత నుంచి మార్పు మొదలైంది. కేంద్రం చెప్పిన ప్రత్యేక ప్యాకేజీకి తలొగ్గారు. హోదా కన్నా ప్యాకేజీ మిన్న అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబు సమర్థించడంతో కేంద్రం కూడా ప్యాకేజీ ఇస్తే చాలన్న భావనకు వచ్చింది. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు టీడీపీ వెనుకాడింది. నాటి రాష్ట్ర ప్రభుత్వం వంతపాడడంతో ప్రత్యేక హోదా మరుగన పడింది. మధ్యలో ప్యాకేజీ నాటకం నడిపారు గాని అది కూడా అమలు కాలేదు. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కాలం వెళ్లదీసిన బాబు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఘోరంగా ఓడిపోయి కేవలం 23 సీట్లతో సరిపెట్టుకున్నారు. కానీ, ఆయన అధికారంలో ఉండగా ప్యాకేజీకి మద్దతు పలకడమే ఇప్పటికీ ఏపీకి శాపంగా మారింది.
ప్యాకేజీ వద్దు.. హోదా ఇవ్వండి : వైసీపీ ఎంపీల ఫైర్
ఏపీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్.. పునర్విభజన చట్టంలో ఇతర అంశాలపైనా స్పందించారు. హోదా కాకుండా చట్టంలో చాలా అంశాలున్నాయని వాటిని పరిష్కరించడానికి కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తున్నదని ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ప్రాజెక్టులు విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పడుతుందని మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని అయితే చాలా అంశాలనురెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాలి అని తెలిపారు.
వాటి సంగతి అటుంచితే ప్రత్యేక హోదాపై కేంద్రం తీరుపై వైసీపీ ఎంపీలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయినా పునర్విభజన చట్టంలోని అంశాలు నెరవేరలేదని తెలిపారు. అందుకు గల కారణాలు ఏంటో కేంద్రం చెప్పాలని అన్నారు. తమకు ఎలాంటి ప్యాకేజీ అవసరం లేదని ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మరోసారి స్పష్టం చేశారు. చట్టం అమలుకు పదేళ్ల గడువు ఉంటే.. ఇప్పటికే ఏడేళ్లు పూర్తి అయ్యాయని.. చాలా అంశాలు పూర్తి చేయలేదని లోక్ సభలో ప్రస్తావించారు.
ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి.. ప్రత్యేక హోదా విధానాన్ని 14వ ఆర్థిక సంఘం రద్దు చేసిందని.. ప్యాకేజీ రూపంలో పెద్ద మొత్తం ఇచ్చిందని సర్దుబాటు వ్యాఖ్యల్ని చేశారు కేంద్రమంత్రి. వైసీపీ ఎంపీల తాజా వ్యాఖ్యలతో ప్రత్యేక హోదాపై తమ స్టాండ్ ఏంటనేది మరోసారి స్పష్టమైంది.