iDreamPost
iDreamPost
టాలీవుడ్ లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి రేపుతున్న మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పటికప్పుడు బ్రేకుల మధ్య కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతా సవ్యంగా ఉంది అలియా భట్ కూడా వచ్చేసిందని అభిమానులు సంతోషపడుతున్న సమయంలో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ క్వారెంటైన్ లోకి వెళ్లిపోవడం అందరికీ షాక్ కలిగించింది. కాకపోతే ఆ వ్యాధి సూచనలు ఏమి లేవు కాబట్టి త్వరగానే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన మేజర్ పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకొంత మాత్రమే బాలన్స్ ఉందట.
సినిమాని ఎప్పుడు విడుదల చేయాలనే దాని గురించి రాజమౌళి ఎలాంటి టెన్షన్ పడటం లేదు. అయితే 2021 దసరా లేదా దీపావళి వైపు చూస్తున్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే 2022 సంక్రాంతికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలని నిర్మాత దానయ్యకు ఇది వరకే చెప్పేశారట. ఇక అసలు విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ స్పెషల్ టీజర్ ఒకటి జనవరి 26న గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సంగతిని అఫీషియల్ గా సంక్రాంతి రోజున ప్రకటించి బజ్ ని మళ్ళీ అమాంతం పైకి తీసుకెళ్లేలా ఆర్ఆర్ఆర్ మార్కెటింగ్ టీమ్ మంచి ఎత్తుగడని సిద్ధం చేసినట్టు తెలిసింది.
ఇప్పటిదాకా ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రెండు క్యారెక్టర్ టీజర్లు వచ్చాయి. ఒకటి చరణ్ అల్లూరి సీతామరామరాజుగా, రెండోది తారక్ కొమరం భీంగా కనిపించినవి. ఇద్దరు పరస్పరం వాయిస్ ఓవర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే కాంబోలో మాత్రం ఎలాంటి వీడియో ఇప్పటిదాకా బయటికి రాలేదు. తాజాగా సిద్ధం చేస్తున్న వీడియోలో ఈ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించే సీన్ ఉంటుందట. మరి దీనికి గొంతును ఎవరిస్తారు అనే సందేహం రావడం సహజం. మెగాస్టార్ చిరంజీవితోనే చెప్పించబోతున్నారని వినికిడి. ఇతర బాషలకు ఎవరిని సెట్ చేస్తారో వెయిట్ చేసి చూడాలి. సో ఆర్ఆర్ఆర్ కానుకకు వెయిట్ చేయండి మరి.