iDreamPost
android-app
ios-app

Akhilesh Yadav, Yogi Adityanath – బాబు బాటలో అఖిలేష్‌.. కుటుంబం లేనివారంటూ యోగిపై విమర్శలు

  • Published Dec 02, 2021 | 9:23 AM Updated Updated Dec 02, 2021 | 9:23 AM
Akhilesh Yadav,  Yogi Adityanath – బాబు బాటలో అఖిలేష్‌.. కుటుంబం లేనివారంటూ యోగిపై విమర్శలు

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఒకరిని మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అన్ని పార్టీలు యాత్రలు ప్రారంభించడంతో విమర్శలు, ప్రతివిమర్శలతో యూపీ ఎన్నికల సభలు హోరెత్తుతున్నాయి. నేతల మధ్య విమర్శలు కొన్నిసార్లు అతి శృతిమించేస్తున్నాయి. వ్యక్తిగత దూషణలకు దారితీస్తున్నాయి. ప్రసంగాలలో కుటుంబాల ప్రస్తావనలు చోటు చేసుకుంటున్నాయి. యూపీ పీఠం దగ్గరకు వచ్చి చేజారే అవకాశముందని సర్వేలు చెబుతుండడం ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌లో అసహనాన్ని పెంచుతున్నట్టు ఉంది. ఆయన ప్రసంగాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కుటుంబం లేనివాడిగా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అలాగే జిన్నాను పొగడడం వివాదం రాజేసింది.

2019 సాధారణ ఎన్నికల ముందు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇదే తరహా విమర్శలకు దిగారు. ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకుని ఆయనకు కుటుంబం లేదని, కట్టుకున్న భార్యను చూడనివాడు దేశాన్ని ఏం చూస్తాడని వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీని వల్ల బాబుకు మంచికన్నా చెడు ఎక్కువ అయ్యింది. ఇప్పుడు అఖిలేష్‌ కూడా ఇదే తరహాలో యోగిపై విమర్శలు దిగారు. ‘మాకు కుటుంబాలు ఉన్నాయి. అందుకే ఒక కూలీ, రైతు చనిపోతే అతని కుటుంబ సభ్యులు ఎంత బాధ అనుభవిస్తున్నారో మాకు అర్థమవుతుంది. కుటుంబాన్ని పోషించేవారికి ఒక సాధారణ కుటుంబం బాధను అర్థం చేసుకుంటారు. కుటుంబాలు లేనివారు కాదు. అందుకే వారి సామన్యుల బాధలను పట్టించుకోరు’ అంటూ పరోక్షంగా యోగీపై విమర్శలకు గుప్పించారు. అయితే ఈ విమర్శలలో కుటుంబాల ప్రస్తావన రావడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అఖిలేష్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న బీజేపీ నాయకులు ప్రతి విమర్శలకు దిగారు. ‘కుటుంబాలు ఉన్నంత మాత్రాన్న సామాన్యుల బాధలు అర్థం చేసుకునే మనస్సు ఉండదు. కొన్ని కుటుంబాల యావ వల్లే దేశంలో అవినీతి తాండివిస్తున్న విషయాన్ని గుర్తెరగాలి’ అని పరోక్షంగా ఎస్‌పీ కుటుంబం గురించి ప్రతివిమర్శలకు దిగారు.

ఇవే కాదు.. యూపీ ప్రచారంలో పలు అంశాలు విమర్శలకు దారితీస్తున్నాయి. అఖిలేష్‌ రెండు రోజుల క్రితం జరిగిన పటేల్‌ జయంతి సందర్భంగా జరిగిన సభలో మహ్మద్‌ ఆలీ జిన్మాకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలపై సీఎం యోగి, ఆయన మంత్రివర్గం విరుచుకుపడుతున్నారు. అఖిలేష్‌ మాట్లాడుతూ ‘మహాత్మాగాంధీ, సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, మహ్మద్‌ ఆలీ జిన్నాలు ఒకే కాలేజీలో బారిస్టర్‌ చదివారు. దేశం స్వాతంత్య్రం పొందడానికి ఈ నలుగురు సహాయం చేశారు. ఏ పోరాటానికి ఈ నలుగురు వెనుకడుగు వేయలేదు’ అని వ్యాఖ్యానించారు. అలాగే 1948లో మహాత్మా గాంధీ హత్య అనంతరం నాటి హోమ్ మినిష్టర్ సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేదించారని ఓటర్లకు గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలపై యోగి మండిపడ్డారు. దేశాన్ని విభజించిన జిన్నాను, దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన పటేల్‌తో పోల్చడమా. ఇది సిగ్గుమాలిన చర్యగా ఆరోపించారు. ఇది తాలిబానీ మనస్తత్వంగా అభివర్ణించి నిప్పు రాజేశారు.

ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యా ఒక అడుగు ముందుకేసి ఎస్పీ అధినేతను ‘అఖిలేష్‌ ఆలీ జిన్నా’గా అభివర్ణించారు. అయితే యోగీ, అఖిలేష్‌ల మధ్య సాగుతున్న మాటల యుద్ధాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి తప్పుపట్టారు. ఎన్నికల ముందు హిందూ ముస్లిం తరహాలో వాతావరణాన్ని దెబ్బతీయడానికి బీజేపీ, ఎస్పీలు కలిసి వ్యూహం పన్నాయన్నారు. ఎంఐఎం నేత ఒవైసీ కూడా అఖిలేష్‌ వ్యాఖ్యలను ఖండించారు. జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని భారత్‌ లో ఉంటున్న ముస్లింలు తిరస్కరించారని గుర్తు చేశారు. యూపీ ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకున్నా ప్రచారంలో మాటల యుద్ధం మొదలైంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల సమయంలో విమర్శలు ఏ స్థాయిలో కొనసాగుతాయో అర్థం చేసుకోవచ్చు.

Also Read : Up Elections – ప్ర‌జ‌ల్లోకి యూపీ బీజేపీ : తంత్రం ప‌ని చేస్తుందా?