iDreamPost
android-app
ios-app

ఒళ్ళు గగుర్పొడిచే ‘సైనైడ్’ కిల్లర్

  • Published Jun 26, 2020 | 1:04 PM Updated Updated Jun 26, 2020 | 1:04 PM
ఒళ్ళు గగుర్పొడిచే ‘సైనైడ్’ కిల్లర్

ఇటీవలి కాలంలో సైకో కిల్లర్ కథలకు సౌత్ లో బాగా ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా భాషాబేధం లేకుండా అన్ని చోట్ల ఆడియన్స్ వీటిని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అయితే ఇందులో అధిక శాతం ఫిక్షన్ స్టోరీస్ తో తెరకెక్కినవే. త్వరలో ఓ రియల్ కిల్లర్ బయోపిక్ మల్టీ లాంగ్వేజ్ వెర్షన్స్ లో రూపొందబోతోంది. టాలీవుడ్ లో ‘నా బంగారు తల్లి’ లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమా తీసిన రాజేష్ టచ్ రివర్ త్వరలో ‘సైనైడ్’ అనే సినిమాను రూపొందించబోతున్నారు. ఇది నిజ జీవిత కథ. కర్ణాటకలో సైనైడ్ మోహన్ గా పేరు గాంచిన హంతకుడి గాధను ఇందులో చూపించబోతున్నారు.

వయసులో ఉన్న అందమైన అమ్మాయిలను మభ్యపెట్టి వాళ్లకు శారీరకంగా లోబరుచుకుని గర్భం పోగొట్టే పేరుతో వాళ్లకు సైనైడ్ ఇచ్చి చంపడం ఇతని ప్రవృత్తి. ఫిజికల్ ఇన్స్ ట్రక్టర్ గా పని చేసిన మోహన్ చాలా కాలం తప్పించుకుని తిరిగాడు. 2009లో అరెస్ట్ అయ్యాక నిన్నే తుది తీర్పులు ఇచ్చారు. 14 జీవిత ఖైదులు, 6 ఉరి శిక్షలు ఒకేసారి ఖరారు చేస్తూ మంగళూరు కోర్టు తీర్పు ఇచ్చింది. మోహన్ తనకు లొంగిపోయిన స్త్రీల పట్ల చాలా దారుణంగా వ్యవహరించేవాడు. 20 అమ్మాయిలను హతమార్చి వాళ్ళ పచ్చని జీవితాలను నాశనం చేశాడు. ఆఖరి యువతి కుటుంబ సభ్యులు పెట్టిన కేసుతో ఒక్కొకటిగా దుర్మార్గాలు బయట పడ్డాయి.

ఇతన్ని పట్టివ్వడంలో ఇద్దరు కీలక పాత్ర పోషించారు. మోహన్ సైనైడ్ ఇచ్చినా బ్రతికిన ఓ అమ్మాయితో పాటు ఇతను జాతకం చెప్పించుకున్న ఓ ఆస్ట్రాలజర్ శ్గిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించారు. హోటల్ రూమ్స్ లో హత్య చేయడం అలవాటుగా చేసుకున్న మోహన్ కథ వింటే ఒళ్ళు గగుర్పాటుకు గురవడం ఖాయం. ఇప్పుడీ సినిమాకు అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు. కమల్ హాసన్ విశ్వరూపం సినిమాకు పనిచేసిన సాజత్ సైనుద్దీన్ ఛాయాగ్రహణం అందిస్తుండగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న జార్జ్ జోసెఫ్ సంగీతం సమకూరుస్తున్నారు. లాక్ డౌన్ పూర్తిగా అయిపోయాక వేగంగా షూటింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందనుంది.