iDreamPost
iDreamPost
లాక్ డౌన్ వచ్చాక షూటింగులు చేయాల్సిన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముందులాగా వందలాది యూనిట్ సభ్యులను కూర్చుకుని నెలల తరబడి తీసే సౌకర్యం కొంతకాలం ఉండకపోవచ్చు. కేసులు పూర్తిగా సమిసిపోయి ఎలాంటి నిబంధనలు లేకుండా స్వేచ్ఛ దొరికినప్పుడే మళ్ళీ మునుపటిలా షూటింగుల సందడిని చూడొచ్చు. అందుకే దర్శక నిర్మాతలు కొత్తగా ఎక్కువ క్యాస్టింగ్, లొకేషన్లు లేని సబ్జెక్టులు వినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎంత వేగంగా తీస్తే అంతగా సేఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీలైతే నెల రోజుల లోపు మొత్తం షూటింగ్ ని పూర్తి చేసుకోగలిగిగితే. ఏంటి అసాధ్యమనుకుంటున్నారా. దీనికే ఆలా అనిపిస్తే 48 గంటల్లో తీయడం గురించి చెబితే ఏమంటారో. కానీ అలాంటి అరుదైన అద్భుతాలు గతంలో జరిగాయి.
1989లో కన్నడలో దినేష్ బాబు దర్శకత్వంలో ‘ఇదు సాధ్య’ అనే సినిమా తీశారు. కేవలం రెండే రెండు రోజుల్లో మొత్తం షూట్ పూర్తి చేశారు. అలా అని ఎవరో చిన్నా చితక ఆర్టిస్టులతో పని కానిచ్చారేమో అనుకోకండి. ఆ సమయంలో మంచి ఫామ్, డిమాండ్ ఉన్న యాక్టర్లనే తీసుకున్నారు. రేవతి ప్రధాన పాత్ర పోషించగా అనంత్ నాగ్, శంకర్ నాగ్, శ్రీనాధ్, డిస్కో శాంతి, శ్రీవిద్య, చంద్రులు తదితర దిగ్గజాలందరూ ఇందులో భాగం పంచుకున్నారు. తెలుగువాళ్లకూ పరిచయమున్న విలన్లు కన్నడ ప్రభాకర్, రమేష్ అరవింద్, దేవరాజ్ లు ఇందులో ఉన్నారు. ఇంత తారాగాణాన్ని పెట్టుకుని చాలా ప్లాన్డ్ గా 48 గంటల్లో మొత్తం పూర్తి చేశారు. ఇందులో పాటలు ఉండవు. కథ మొత్తం మర్డర్ మిస్టరీ కం హారర్ థ్రిల్లర్ గా సాగుతుంది. దీన్ని తెలుగులో ‘హత్య’ పేరుతో డబ్బింగ్ చేశారు. కర్ణాటకలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ పర్వాలేదు అనిపించుకుంది.
అంత తక్కువ టైంలో మంచి టెక్నీకల్ వాల్యూస్ తో ఎలా తీశారనే దాని మీద అప్పట్లో పలు కథనాలు కూడా వచ్చాయి. కాకపోతే సినిమా నిడివి కేవలం గంటన్నర మాత్రమే ఉంటుంది. గ్రిప్పింగ్ గా సాగుతూ ఓ బంగాళాలో షూటింగ్ కోసం వచ్చిన వాళ్ళను ఎవరు హత్య చేస్తున్నారు అనే పాయింట్ మీద మూవీ రన్ అవుతుంది. విజయానంద్ సంగీతం బాగా దోహదపడింది. రేవతి మంచి ఫామ్ లో ఉన్నప్పుడు చేసిన మూవీ ఇది. లెన్త్ తక్కువగా ఉండటంతో దీనికి అదనపు షోలు కూడా వేసేవారు. అందరూ ఫాలోయింగ్ ఉన్న స్టార్ క్యాస్టింగ్ కావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. బడ్జెట్ కూడా చాలా తక్కువగా పూర్తి చేశారు. సో ఇప్పుడు ఇలాంటి కథలను, ప్లానింగ్ ను ఎంచుకుంటే ఈ కరోనా క్రైసిస్ లో ఉపయుక్తంగా ఉంటుంది. సరే దీనికే ఆశ్చర్యపోతున్నారు కదూ. మరి ఈ రికార్డును బ్రేక్ చేస్తూ 24 గంటల్లో షూట్ చేసిన మరో సౌత్ మూవీ కూడా ఉంది. దాని గురించి మరోసారి చెప్పుకుందాం.