Idream media
Idream media
గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడంతో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎవరెంత నచ్చచెప్పినా ససేమిరా అన్నారు. ఆయనను మళ్లీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టేందుకు పార్టీలోని సీనియర్లు ఎందరో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. అవన్నీ విఫలం కావడంతో… కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే గత ఆగస్టు నుంచీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతూ వస్తున్నారు.
అయితే.. ఆ పార్టీ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక అధ్యక్షుడి లేదా అధ్యక్షురాలి నియామకం అయిన ఏడాదిలోగా పూర్తి స్థాయి అధ్యక్షుడిని లేదా అధ్యక్షురాలిని ఎన్నుకోవాలి. సోనియా గాంధీ పదవీ కాలం ఆగస్టు 10వ తేదీతో ముగిసిపోనుంది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవు. ఈ మేరకు సోనియా గాంధీనే మరో ఏడాది పాటు కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందు నిమిత్తం త్వరలో కమిటీ సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఎన్నికల సంఘానికి సమాచారం ఇస్తారు.
ఆగస్టులో సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియామకం అయిన తర్వాత వరుసగా.. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత మూడు నెలలకు పైబడి కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగలేదు. దీంతో మరోసారి పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే పొడిగించనున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ 1998 నుంచి 2017 వరకూ పార్టీ అధ్యక్షురాలిగా 19 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పని చేశారు.