ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల సంచలనం కలిగించిన అబ్దుల్ సలాం ఆత్మహత్య ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ ఘటనలో పోలీసులను బాధ్యులను చేస్తూ వారిని అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. తమ డ్యూటీని చేసిన పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ,వైఎస్సార్‌సీపీలకు ముస్లిం ఓట్లే ముఖ్యమా? ముస్లింలే మనుషులా మిగిలిన వాళ్ళు మనుషులు కారా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. తాము మతతత్వ రాజకీయాలు చేస్తున్నామని అంటున్నారని మరి చంద్రబాబు,జగన్ చేసేవి మతతత్వ రాజకీయాలు కావా అంటూ మండిపడ్డారు. ముస్లింల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. హిందూ మతానికి అన్యాయం జరిగిందని టీటీడీలో అక్రమాలను ప్రశ్నిస్తే తమపై హిందుత్వ ముద్ర వేస్తున్నారని వాపోయారు.
కాగా పోలీసుల వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు అనంతరం వారి సెల్ఫీ వీడియో బయటకు రావడంతో రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించింది. దాంతో వేధింపులకు పాల్పడిన సంబంధిత పోలీసులను సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. అనంతరం టీడీపీ కి చెందిన లాయర్ రామచంద్రరావు పోలీసులకు బెయిల్ వచ్చేలా ఏర్పాటు చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
నిందితులకు బెయిల్ వచ్చిందని టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాగా పోలీసులకు బెయిల్ రావడానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న అడ్వకేట్ రామచంద్రరావు వాదనలు కారణం అని తేలడంతో టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయింది. దాంతో టీడీపీకి రామచంద్రరావు రాజీనామా చేశారు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పోలీసుల అరెస్ట్ తప్పని సంచలన వ్యాఖ్యలు చేయడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి…