iDreamPost
iDreamPost
తన విచిత్రమైన వ్యాఖ్యలతో తరచు వార్తల్లో ఉండే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మళ్లీ రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోయే వ్యాఖ్య చేశారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీనే చూస్తున్నారని అన్నారు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఆదాయాన్ని పెంచాలని, మూలధనం పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మాటల యుద్ధం మంచిదికాదని సోము వీర్రాజు అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసినందుకా?
ఏపీ ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తున్నందుకా బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు అని సోమును వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీవ్రంగా నిరాశ పరిచింది. బీజేపీ ఉత్తరాది పార్టీగా, మోదీ గుజరాత్ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తికి అదనపు నిధులు ఎలా కేటాయిస్తారో బడ్జెట్‌లో పేర్కొనలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలు ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని కార్మికులు ఏడాదిగా ఆందోళన చేస్తుంటే పట్టించుకోవడం లేదు. విశాఖకు రైల్వే జోన్ ఊసే లేదు. రెవెన్యూ లోటు భర్తీ చేయడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపిన దిశ చట్టంపై ఇప్పటి వరకూ చర్య తీసుకోలేదు.
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ ప్రజల ఆశలపై నీళ్లు చల్లేశారు. ఇలా ఏ విధంగా చూసినా రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీసిన బీజేపీ వైపు ప్రజలు ఎందుకు చూస్తున్నారో సోము వీర్రాజు చెప్పాలని అంటున్నారు. రూ.50కే చీప్ లిక్కర్, బహిరంగ మార్కెట్‌లో రూ.42కే కిలో బియ్యం, విశాఖ కేజీహెచ్, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ, గుంటూరు జిన్నా టవర్ పేరు మార్పు అంటూ తాను ఇచ్చిన హామీలకు జనం ఫిదా అయిపోయారని సోము భావిస్తున్నారా? అని అడుగుతున్నారు.
అసలు ఏపీకి చేసిందేమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేస్తాం అంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చే సోము.. బీజేపీ రాష్ట్రంలో ఎలా గెలుస్తుందని భావిస్తున్నారో చెప్పాలని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏడున్నరేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా రాష్ట్రానికి ఫలానా ప్రయోజనం చేకూర్చాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. సీఎం జగన్ ఆదాయాన్ని పెంచాలని, మూలధనం పెంచుకోవడంపై దృష్టి సారించాలని ఉచిత సలహాలు ఇస్తున్న సోము.. విభజిత కష్టాలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వంలో తన పలుకుబడి ఎందుకు ఉపయోగించరు? ఎంతసేపూ టీడీపీ బాటలో నడుస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం తప్ప రాష్ట్రాభివృద్ధికి నిర్మాణాత్మక సూచనలు ఇచ్చిందీ లేదు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం ఒక్క చంద్రబాబునాయుడే బీజేపీ వైపు చూస్తున్నారని, రాష్ట్రంలో ఇంకెవరూ ఆ పార్టీని వైపు చూడడం మానేశారని వైఎస్సార్ సీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
Also Read : గుంటూరు జిన్నా టవర్ విషయంలో బీజేపీకి ఊహించని ట్విస్ట్