Idream media
Idream media
45 ఏళ్ల క్రితం రాయదుర్గం చాలా చిన్న ఊరు. అనంతపురం జిల్లాలో ఒక మూలకి విసిరేసినట్టు వుంటుంది. సగం మంది కన్నడం, మిగిలిన సగం తెలుగు, కన్నడం మిక్స్ చేసి మాట్లాడుతారు. ఒకప్పుడు బళ్లారి జిల్లాలో వుండేది. రాష్ట్రం విడిపోయినపుడు అనంతపురం జిల్లాలో చేరి ఆంధ్రాలో కలిసింది. అయితే జనానికి అనంతపురంతో కంటే, బళ్లారితోనే ఎక్కువ అనుబంధం. వ్యాపారాలు, పెళ్లిళ్లు అన్నీ కర్నాటకతోనే.
రాయదుర్గంలో అన్నీ స్లోగా వుండేవి. పేపర్ మధ్యాహ్నం వచ్చేది. సినిమాలు ఆరు నెలలకి వచ్చేవి. 50 కిలోమీటర్ల బళ్లారికి బస్సు 3 గంటలు వెళ్లేది. ఆశ్చర్యంగా రైలు Narrow gauge బళ్లారికి మాత్రమే వెళ్లే ఆ పొగబండి ఎంత మెల్లిగా వెళ్లేదంటే మనం కిందకు దిగి చిచ్చు పోసుకుని మళ్లీ ఎక్కచ్చు. అయితే దురలవాట్లు మాత్రం అందరికి స్పీడుగా అబ్బేవి.
మా బ్యాచ్‌కంతా చెన్నవీర రింగ్ మాస్టర్. స్టెప్ కటింగ్ అప్పట్లో ఫ్యాషన్. హిప్పీ జుట్టుతో బెల్‌బాటం ప్యాంట్‌తో స్టయిల్‌గా వుండేవాడు. మూతిమీద నూగు మీసముండేది. మాకెవరికీ మీసాలు ఇంకా రాలేదు. గొంతు కూడా ఆడపిల్ల గొంతులా వున్న కాలం. 9వ తరగతి చదివేవాన్ని. చెన్నవీర టెన్త్. మాకంటే వయసులో పెద్దాడు కాబట్టి కొంచెం భయం.
ఈ చెన్నవీర లక్ష్మీబజార్ బ్యాచ్‌లో రెండు సంస్కరణలు తెచ్చాడు. అందరితో సిగరెట్లు తాగించడం, పేకాట నేర్పించడం. స్మోకింగ్‌తో అంతకు ముందే పరిచయమున్నప్పటికీ దట్టమైన పొగ, నాన్‌స్టాఫ్ దగ్గు వచ్చింది వీడి వల్లే. బ్రిస్టల్ సిగరెట్ 12 పైసలు. లోక్‌నాథ్, కృష్ణ, శేఖర్ ఇలా కొంత మంది చెన్నవీర నాయకత్వంలో తలా ఇంత వేసుకుని బ్రిస్టల్ ప్యాకెట్, అగ్గిపెట్టె తీసుకుని కురాకుల గుట్ట వైపు వెళ్లాం (రాయదుర్గం చుట్టూ కొండలే. ఒక్కో కొండకు ఒక్కో పేరుండేది). ఎవరూ లేని చోట నోట్లో పెట్టుకున్నాం. ఒకడు NTRలా ఇంకోడు ANRలా ఫీలవుతూ ఫోజులిచ్చాం. కృష్ణ, శోభన్‌బాబులకి అసలు సిగరెట్ కాల్చడమే రాదు. వాళ్లని ఇమిటేట్ చేయడం అసాధ్యం. చెన్నవీర అప్పటికే సీనియర్. నోట్లో, ముక్కులో ఏకకాలంలో గుప్పున గుప్పెడు పొగ వదిలేవాడు. నాకు సిగరెట్ నోట్లో పెట్టుకోవడమే రాదు. ఫిల్టరంతా ఎంగిలితో తడిసేది.
పొగపీల్చి వదిలితే, పిల్లల్ని ప్రిన్సిపాల్ చూసినట్టు చెన్నవీర చూశాడు. సిగరెట్ తాగడమంటే పొగని నోట్లో పీల్చి వదలడం కాదు, గుండెల వరకూ పీల్చాలి. కాఫీ జుర్రినట్టు పొగని లోపలికి లాగాలి అని క్లాస్ పీకాడు. కృష్ణ, శేఖర్‌లకి ఈ కిటుకు తెలుసు. తెలియంది నాకూ, లోక్‌నాథ్‌కే.
ఇద్దరం సిగరెట్ కొన ఎర్రగా మండేలా జుర్రున లాగి, పొగని గుటుక్కున మింగాం. మా దగ్గుతో కొండంతా ఎకో సౌండ్ వచ్చింది. నాకైతే ముక్కులోంచి కాకుండా చెవుల్లో కూడా పొగ వచ్చినట్టనిపించింది. చెన్నవీర మళ్లీ క్లాస్ పీకాడు. తాను స్టయిల్‌గా దమ్ములాగి చూపించాడు. రెండు మూడు రోజుల్లో అలవాటై దాదాపు 25 ఏళ్లు పీడించింది. మానేసి పదేళ్లయినా ఇప్పటికీ సిగరెట్ తాగినట్టు కలలొస్తాయి.
పొగలో మమ్మల్ని ఎక్స్‌ఫర్ట్‌లు చేసిన తర్వాత చెన్నవీర పేకాట స్కూల్ తెరిచాడు. సినిమాల్లో తప్ప పేక ముక్కలు కళ్లార చూడని వాళ్లని కూడా గ్రేట్ గాంబ్లర్లగా మార్చాడు. మొదట ఆడింది మూడు ముక్కలాట. దానికి పెద్ద తెలివి అక్కరలేదు. సులభంగానే వచ్చింది.
అనేకసార్లు ఓడిపోయి (ఆటకి పావలా) చాలా కష్టపడి రమ్మీ నేర్చుకున్నాను. అయితే ఇదేం కబడ్డీ, గోలీలాట కాదు కదా గ్రౌండ్‌లో కూచుని ఆడడానికి. ఒక రహస్య స్థలం కావాలి. వూరి బయట కోతిగుట్ట అనే కొండ, దాంట్లో ఒక గుహ. మునులు గుహలో తపస్సు చేసేవాళ్లో లేదో తెలియదు కాని, మేము మాత్రం నైన్త్ సమ్మర్ హాలిడేస్‌ని గుహలోనే గడిపాం. అదే మా కాసినో.
పరమ నాసిరకం పేక ముక్కలతో ఆడేవాళ్లం. కలుపుతూ వుంటే చిరిగిపోయేవి. ఒక సిగరెట్ పత్తామీద పెన్సిల్‌తో చెన్నవీర కౌంట్ వేసేవాడు. బ్రహ్మాండంగా గెలిచినా రెండు రూపాయలు వచ్చేవి కావు. నేనెప్పుడూ గెలిచేవాన్ని కాదు. చెన్నవీర , కృష్ణ అన్నదమ్ములు. వీళ్ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ వుండేది. మోసాన్ని కనిపెట్టలేక పోయేవాన్ని. (ఇప్పటికీ కనిపెట్టలేను. ఇదో బలహీనత)
సిగరెట్లు, బీడీలు తాగుతూ పేకముక్కలు విసురుతూ వున్నపుడు గుహలో వున్న కొండనల్లులకి కోపమొచ్చి ఎవడో ఒకని పిర్రని పీకేవి. వాడు గట్టిగా అరుస్తూ అల్లకల్లోలం చేసేవాడు, అయినా ఆట ఆగేది కాదు. అప్పుడప్పుడు పసిరక పాములు వచ్చేవి. ఎలుగుబంట్లు వున్నాయి కానీ, మా వరకూ రాలేదు. భయం తెలీని అమాయకపు రోజులు.
ఇపుడు కోతిగుట్ట లేదు. కంకరగా మారిపోయింది. జ్ఞాపకాల్లో వున్న వూరు లేనేలేదు. చెన్నవీర మనుమరాలితో ఆడుకుంటూ ఫేస్‌బుక్‌లో కనిపిస్తూ వుంటాడు. కృష్ణ 16 ఏళ్ల వయసులోనే TBతో చనిపోయాడు. లోక్‌నాథ్ పిల్లల పెళ్లిళ్లు చేసేసి బళ్లారిలో వున్నాడు. శేఖర్ రాయదుర్గంలోనే ఒక పెద్ద హోటల్ నడుపుతున్నాడు. నేను అమెరికాలో మా అబ్బాయి దగ్గరకొచ్చి ఇవన్నీ రాస్తున్నా.
కాలం మన నుంచి అన్నీ లాక్కుంటుంది. జ్ఞాపకాలని మాత్రం లాక్కోలేదు.