iDreamPost
android-app
ios-app

Skill Scam, TDP, Pattabhiram – ‘స్కిల్‌’ స్కాం.. టీడీపీకి కంగారెందుకు..?

  • Published Dec 16, 2021 | 2:44 PM Updated Updated Dec 16, 2021 | 2:44 PM
Skill Scam, TDP, Pattabhiram – ‘స్కిల్‌’ స్కాం.. టీడీపీకి కంగారెందుకు..?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో కుట్ర పూరితంగానే లక్ష్మీనారాయణ, సుబ్బారావును అరెస్ట్‌ చేశారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించడం మరీ విడ్డూరంగా ఉంది. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం చేతిలో సీఐడీ కీలుబొమ్మలా మారిందని అన్నారు. సీఐడీని అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. నిజాయితీపరులకు అవినీతి మరక అంటగడతారా? అని  ప్రభుత్వ తీరును నిలదీశారు. సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో అవాస్తవాలు నమోదు చేశారని చెప్పారు. డిజైన్‌టెక్‌ సంస్థ పన్ను ఎగవేతకు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ఏం సంబంధం? ఉందని ప్రశ్నించారు. షెల్‌ కంపెనీలకు వెళ్లిన డబ్బంతా మళ్లీ డిజైన్‌టెక్ సంస్థకే మళ్లిందని రాశారన్నారు. కొందరి జేబుల్లోకి డబ్బు వెళ్లిందని ఎలా చెబుతారని అడిగారు. చెంచాగిరి డిపార్ట్‌మెంట్‌గా సీఐడీ మారిపోయిందని  పట్టాభి అన్నారు.

ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరిట జరిగిన కుంభకోణంపై సీఐడీ విచారణ వేగవంతం చేసినప్పటి నుంచి పచ్చబ్యాచ్‌ ఎందుకు భుజాలు తడుముకుంటోంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో రోజురోజుకు పురోగతి కన్పించడం, కీలక వ్యక్తుల అరెస్టులు కావడం వంటివి జరుగుతున్న కొద్దీ టీడీపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు? ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌, మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ తనిఖీలు చేసే సమయంలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ అక్కడకు వెళ్లి హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఎవరూ అడగకుండానే అక్కడకి వెళ్లి పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చిన ఆయనపై విచారణను అడ్డుకున్నారని సీఐడీ ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. పచ్చబ్యాచ్‌కు ప్రధాన పురోహితుడైన శ్రీమాన్‌ రాధాకృష్ణపై అలా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం అన్యాయం అంటూ చంద్రబాబు నుంచి కింది స్థాయి నాయకుల వరకూ రాష్ట్ర ప్రభుత్వంపై కోప్పడిపోయారు. ఇక అప్పటి నుంచి రోజూ ఎవరో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఐడీపై కుట్ర అంటూ ఆరోపణలు చేస్తున్నారు. వాటిని పచ్చ మీడియాలో ప్రముఖంగా ప్రచురిస్తున్నారు.

విచారణ కూడా టీడీపీ నేతలే చేస్తారా!

ఈ కేసులో కుట్ర పూరితంగానే లక్ష్మీనారాయణ, సుబ్బారావును అరెస్ట్‌ చేశారని చెప్పడానికి టీడీపీ నేత పట్టాభికి ఉన్న అర్హత ఏమిటి? ఆయన వద్ద ఏం ఆధారాలు ఉన్నాయి? నిజాయితీపరులకు అవినీతి మరక అంటగడతారా? అని ఆవేశపడిపోతున్న పట్టాభికి నిజంగా నిజాయితీపరులైతే నిర్ధోషులుగా కేసు నుంచి బయటపడతారన్న సంగతి తెలియదా? విచారణ జరుగుతుండగానే ఎందుకీ ఆత్రుత. చెంచాగిరి డిపార్ట్‌మెంట్‌గా సీఐడీ మారిపోయిందని, రిమాండ్ రిపోర్ట్‌లో అవాస్తవాలు నమోదు చేశారని చెబుతున్నారంటే ఈయన వద్ద వాస్తవాలు ఉన్నాయా? అయితే అవి ఏమిటి? రోజువారీ విచారణను ప్రభావితం చేసేలా.. అధికారులను బెదిరించేలా.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఇలా విమర్శలు చేసే హక్కు టీడీపీ నాయకులకు ఎవరిచ్చారు? పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇష్టానుసారం మాట్లాడడమేమిటి?

ఈ కుంభకోణంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులు రూ.242 కోట్లు తెలుగుదేశం పెద్దల ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపణలు ఉన్నప్పుడు చట్టపరంగా ఎదుర్కోవాలి కాని మీడియా సమావేశాలు పెట్టి ఊగిపోవడం ఏమిటి? టీడీపీ నేతలు హత్యకేసుల్లోనూ, ఆర్థిక నేరాల్లోనూ నిందితులైతే చట్టం తన పని తాను చేయకూడదా? అలా చేస్తే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని వేధిస్తున్నట్టా? ఇదెక్కడి పద్ధతి? రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించడం, నిత్యం పోలీసులను కవ్వించేలా విమర్శలు చేయడం రాజకీయమంటారా? అందుకే రాష్ట్రంలో అధికారానికి దూరం అయినప్పటి నుంచి విచక్షణ కోల్పోయి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇంతగా టీడీపీ నేతలు కంగారు పడుతుంటే ఈ కుంభకోణంలో వారి ప్రమేయం ఉందన్న అనుమానాలు జనంలో మరింత బలపడతాయి కదా? ఆ మాత్రం కూడా తెలియకుండా ఆవేశపడితే ఎలా పట్టాభి జీ.