iDreamPost
android-app
ios-app

రౌడీయిజంపై ‘శివయ్య’ దెబ్బ – Nostalgia

  • Published Sep 12, 2020 | 12:24 PM Updated Updated Sep 12, 2020 | 12:24 PM
రౌడీయిజంపై ‘శివయ్య’ దెబ్బ – Nostalgia

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు రాజశేఖర్ ఇచ్చిన బ్లాక్ బస్టర్లు చిన్నవేమీ కావు. అంకుశంలో పోలీస్ ఆఫీసర్ గా మెప్పించినా, అల్లరి ప్రియుడులో లవర్ బాయ్ గా అలరించినా ఆయనకే చెల్లింది. యాక్షన్ సినిమాల్లో ఈయన్ను చూసేందుకు అభిమానులు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. రాజశేఖర్ సైతం అలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు ఎన్నడూ వదులుకోలేదు. అన్న తర్వాత ఆ స్థాయిలో ఘన విజయం సాదించిన చిత్రంగా శివయ్యను చెప్పుకోవచ్చు. 1998లో రాజశేఖర్ అంతగా సక్సెస్ లో లేరు. వరస పరాజయాలు మార్కెట్ ని ప్రభావితం చేశాయి. ఆ టైంలో దర్శకుడు సురేష్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో రామానాయుడు గారు శివయ్యను ప్రకటించారు.

పల్లెటూరి నుంచి వచ్చిన శివయ్య చెల్లెలి చదువు కోసం పట్నంలో మకాం పెడతాడు. ఎంతో సౌమ్యంగా ఉన్నప్పటికీ రోజురోజుకు మితిమీరిపోతున్న అక్కడి గూండాల రౌడీయిజాన్ని భరించలేక ఎదురు తిరుగుతాడు.వాళ్ళ నాయకుడు జ్యోతి(మోహన్ రాజ్)ని ఘోరంగా అవమానిస్తాడు దీంతో శివయ్య చెల్లెల్ని అతని కళ్ళ ముందే మానభంగం చేయిస్తాడు జ్యోతి. దీంతో ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయిన కాలనీ వాళ్ళకు శివయ్య కోర్టు నోటీసులు పంపిస్తాడు. కేసు హియరింగ్ కు రాకముందు శివయ్య ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. చివరికి జ్యోతి ఆగడాలకు శివయ్య ఎలా చెక్ పెట్టాడు అనేదే క్లైమాక్స్. అప్పటికే ఇలాంటి కథలతో ఎన్నో సినిమాలు వచ్చినప్పతికిస్ శివయ్య ట్రీట్మెంట్ లోని ఫ్రెష్ నెస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. హింస కొంత మితిమీరినప్పటికి స్క్రిప్ట్ డిమాండ్ మేరకు పెట్టారు.

దీనికి కథ స్క్రీన్ ప్లే మాటలు పోసాని కృష్ణమురళి అందించగా ఇప్పటి నటుడు కం దర్శకుడు రవిబాబు శివయ్యతోనే నెగటివ్ పాత్రలో పరిచయమయ్యారు. మెయిన్ విలన్ గా నటించిన మోహన్ రాజ్ గుండు అవతారంలో నిజంగానే భయపెట్టేశారు. అప్పటిదాకా ఫ్యామిలీ మూవీస్ కి మాత్రమే పరిమితమైన ఎంఎం శ్రీలేఖ తాను కమర్షియల్ ప్రాజెక్ట్ ని సైతం డీల్ చేయగలనని ఋజువు చేసుకున్నారు. పాటలు కూడా హిట్టయ్యాయి. శివయ్య వంద రోజుల వేడుకను అనిల్ కపూర్, కృష్ణంరాజు ముఖ్యఅతిధులుగా ఘనంగా నిర్వహించారు. సంఘవి గ్లామర్, పోలీస్ ఆఫీసర్ గా మోనికా బేడి అందాలు మాస్ కి కనెక్ట్ అయ్యాయి. చలపతిరావు, గిరిబాబు, పుండరికాక్షయ్య, ఏవిఎస్, నరసింహరాజు, బండ్ల గణేష్, రమాప్రభ, ప్రసాద్ బాబు తదితరులు ఇతర పాత్రల్లో మెప్పిస్తారు. సురేష్ బ్యానర్ కు శివయ్య వసూళ్ళ పరంగా ఆ ఏడాది హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. శివయ్య దెబ్బకు రాజశేఖర్ కు కొత్త ఉత్సాహం వచ్చింది.